తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా భారత్-చైనా సైనిక ప్రతినిధుల 9వ దఫా భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు ఈరోజు(సోమవారం) తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 16 గంటల పాటు సుదీర్ఘంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. బలగాలు ఉపసంహరణ ప్రక్రియపైనే ప్రధానంగా ఈ చర్చ జరిగినట్లు సమాచారం. అయితే చర్చలు ఎంతవరకు సఫలమయ్యాయనే విషయం తెలియాల్సి ఉంది.
చైనా భూభాగంలోని మోల్డో సరిహద్దు శిబిరం ఈ సమావేశానికి వేదికైంది. బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత చైనా పైనే ఉన్నట్లు భారత బృందం స్పష్టం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత బృందానికి పీజీకే మేనన్ నేతృత్వం వహించారు.
చైనానే ప్రారంభించాలి..
నవంబర్ 6న భారత్-చైనాల మధ్య ఎనిమిదో విడత సైనిక చర్చలు జరిగాయి. బలగాల ఉపసంహరణపై ఇరువర్గాలు విస్తృతంగా చర్చించాయి. అయితే ఇదివరకటి చర్చల్లాగే ఇందులోనూ ఎలాంటి ముందడుగు పడలేదు.
ఉపసంహరణ ప్రక్రియ చైనానే ప్రారంభించాలని భారత్ చెబుతూ వస్తోంది. అప్పటివరకు భారత సైన్యం అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె సైతం ఇదే విషయాన్ని పలు మార్లు స్పష్టం చేశారు. దాదాపు 50 వేల మంది భారత సైనికులు తూర్పు లద్దాఖ్ సరిహద్దు వద్ద పహారా కాస్తున్నారు. చైనా సైతం అదే స్థాయిలో బలగాలను మోహరించింది.
ఇదీ చదవండి:అరుణాచల్ మాదే.. అందుకే నిర్మాణాలు: చైనా