థాయిలాండ్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన నిందితుడిని కాల్చిచంపాయి థాయ్ సేనలు. సైకో జవాను కాల్పులు, మట్టుబెట్టేందుకు థాయ్ సేనల యత్నాలతో ఈ ఆపరేషన్ 17 గంటలపాటు కొనసాగింది. నిందితుడి కాల్చివేతతో ఇది ముగిసింది. సైకో కాల్పుల్లో మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు థాయిలాండ్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
ఇదీ జరిగింది..
సైన్యంలో జూనియర్ అధికారిగా పనిచేస్తున్న సార్జెంట్ మేజర్ జక్రపంత్ థోమా.. శనివారం సాయంత్రం నఖోన్ రాచసిమాలోని ఆర్మీ బ్యారెక్స్‌కు వచ్చాడు. అక్కడే ఉన్న సీనియర్ కమాండింగ్ అధికారిపై కాల్పులు జరిపాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తర్వాత బ్యారెక్స్ నుంచి ఆయుధాలు, ఓ వాహనాన్ని తస్కరించి నగరం నడిబొడ్డున ఉన్న టెర్మినల్ 21 షాపింగ్ సెంటర్లో ప్రవేశించాడు. వచ్చిన వెంటనే అక్కడున్న వారిపై కాల్పులు మొదలుపెట్టాడు. దీంతో జనం బెంబేలెత్తి అక్కడి నుంచి హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు.
భూ వివాదమే కారణమా!
భూ వివాదం కారణంగానే కోపోద్రిక్తుడైన జవాను కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు అధికారులు. భయంతో షాపింగ్‌మాల్‌లో నక్కిన ప్రజలను బయటకు తీసుకువచ్చేందుకు యోచిస్తోంది థాయ్ సర్కారు.
ప్రపంచంలో తుపాకీల వ్యాపారం జోరుగా సాగుతున్న దేశాల్లో థాయిలాండ్ ఒకటి. ఇక్కడ కాల్పులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ సైనికాధికారి సామాన్యులను లక్ష్యంగా చేసుకుని భారీగా కాల్పులకు పాల్పడటం మాత్రం ఇదే తొలిసారి.