మహారాజును అవమానించినందుకు ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగికి రికార్డు స్థాయిలో 43 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించింది థాయ్‌లాండ్ కోర్టు.
ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ ఆచరించే థాయ్‌లాండ్‌లో.. రాజకుటుంబ దూషణకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు ఉన్నాయి. దీని ప్రకారం అచన్ అనే మహిళా ఉద్యోగి 29 సార్లు చట్టాన్ని ఉల్లంఘించిందని బ్యాంకాక్ క్రిమినల్ కోర్టు తేల్చింది. రాచరికాన్ని విమర్శిస్తూ ఫేస్బుక్, యూట్యూబ్‌లో నిందితురాలు ఆడియో సందేశాలు పోస్ట్ చేసిందని న్యాయవాదులు తెలిపారు.
నిజానికి అచన్‌కు మొదట 87 ఏళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే చేసిన తప్పును అంగీకరించినందున.. శిక్షను సగానికి తగ్గించింది. తాను పోస్ట్ చేసిన ఆడియోను అప్పటికే చాలా మంది షేర్ చేశారని, అందులో నేరపూరితమైన అంశాలేవీ లేవని భావించానని అచన్ పేర్కొన్నారు. తాను పోస్ట్ చేసిన సమయం తప్పని తెలియలేదని అన్నారు. 40 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశానని, పదవి విరమణకు ఒక్క సంవత్సరం ముందు అరెస్టయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
భయంకరం..
కోర్టు తీర్పును మానవ హక్కుల సంఘాలు పూర్తిగా ఖండించాయి. 'ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు చాలా ఆశ్చర్యకరం. రాచరికాన్ని విమర్శించేవారిని సహించమని చెప్పడమే కాదు, వారిని తీవ్రంగా శిక్షిస్తామని ఈ తీర్పు భయంకరమైన సూచనలు ఇస్తోంద'ని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ పరిశోధకుడు సునాయ్ ఫసూక్ పేర్కొన్నారు. తీర్పుతో థాయ్‌లాండ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు.
2017లో.. రాచరికాన్ని అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన 35 ఏళ్ల సేల్స్‌మన్‌కు 35 ఏళ్ల శిక్ష పడింది. ఇలాంటి కేసుల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక శిక్ష. ఆయనకూ తొలుత 70 ఏళ్ల శిక్ష పడింది. తప్పు అంగీకరించడం వల్ల శిక్ష సగానికి తగ్గింది.
ఇవీ చదవండి:
రాజ్యాంగ సవరణ కోరుతూ థాయ్‌లాండ్‌లో ఆందోళనలు