విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో హక్కుల సాధనతోపాటు దేశంలో కొత్తగా కొలువుదీరనున్న తాలిబన్ల (Afghan Taliban) ప్రభుత్వంలో తమకూ భాగస్వామ్యం కల్పించాలంటూ అఫ్గాన్ (afghan crisis) మహిళలు రోడ్డెక్కి నిరసన (Kabul Women protest) వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ, హక్కులను కాలరాయొద్దంటూ శనివారం వారు కాబుల్‌లో రెండో రోజు కొనసాగించిన నిరసన.. ఉద్రిక్తంగా మారింది. మహిళలంతా ప్రదర్శనగా ప్రెసిడెన్షియల్ భవనం వైపు వెళ్లేందుకు యత్నించడంతో తాలిబన్ ఫైటర్స్ వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులపై టియర్ గ్యాస్‌లు ప్రయోగించారు. ర్యాలీని అడ్డుకుంటున్న తీరు, ఈ క్రమంలో గాయపడ్డ ఓ మహిళకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సదరు మహిళ తలకు గాయమై, నెత్తురోడుతున్నట్లు కనిపిస్తోంది.
హెరాత్‌లో మొదలు..
అఫ్గాన్‌లోని హెరాత్ నగరంలో గురువారం మహిళల నిరసనలు మొదలయ్యాయి. శుక్రవారం కాబుల్‌లో స్థానిక మహిళలు గళం విప్పారు. మరోవైపు వారిపట్ల తాలిబన్లు తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాత్‌లో నిరసనకారుల వద్ద నుంచి కరపత్రాలను లాక్కొని చింపేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. తాలిబన్ల ప్రభుత్వంలో మహిళలకు చోటు దక్కకపోవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిరసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అఫ్గాన్ మహిళలకు ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించినప్పటికీ.. వారికి కేబినెట్‌లో గానీ, ప్రభుత్వంలో, ఏ ఇతర ఉన్నత పదవుల్లో గానీ స్థానం కల్పించే అవకాశం లేదంటూ తాలిబన్ల సీనియర్ నేత మహమ్మద్ అబ్బాస్ ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: Afghan taliban: తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు మరోమారు వాయిదా!