అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా నిలిచిన పంజ్‌షేర్ లోయ(Panjshir Valley).. వారి వశమైంది. తాలిబన్ ఫైటర్ల అధీనంలోకి పంజ్‌షేర్ వెళ్లిందని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పంజ్‌షేర్ ప్రజలకు తాము ఎలాంటి హాని కలిగించబోమని స్పష్టం చేశారు.
"పంజ్‌షేర్ ఇక తాలిబన్ ఫైటర్ల అధీనంలోకి వెళ్లింది. గౌరవనీయ పంజ్‌షేర్ ప్రజలను మేం ఎలాంటి వివక్షకు గురిచేయం. వారంతా మా సోదరులు. ఒకే లక్ష్యంతో మేమంతా దేశ సేవ చేస్తాం."
-జబిహుల్లా ముజాహిద్, తాలిబన్ ప్రతినిధి.
వేలాది మంది తాలిబన్ పైటర్లు.. పంజ్‌షేర్‌లోని ఎనిమిది జిల్లాలను తాలిబన్లు చుట్టుముట్టారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
అంతకుముందు.. తాము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని పంజ్‌షేర్(Panjshir Valley) దళాల నాయకుడు అహ్మద్ మసూద్(Ahmad massoud) ఆదివారం తెలిపారు. తాలిబన్లు తమ ప్రావిన్సును వీడినట్లయితే.. చర్చలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తాలిబన్లతో మొదలైన భేదాభిప్రాయాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని.. తమ డిమాండ్‌ను మానవతా దృక్పథంతో తాలిబన్లు పరిగణలోకి తీసుకుంటారని విశ్వసిస్తున్నట్లు ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు.
అయితే.. తాలిబన్ల ఆక్రమణపై పంజ్‌షేర్ దళాలతో చేరిన అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు స్వయం ప్రకటిత అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్(Amrullah saleh) ఇంకా స్పందించలేదు.
ఏంటీ పంజ్‌షేర్...?
హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షేర్ ప్రావిన్స్(Panjshir afghanistan) ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. గతంలో తాలిబన్ల పాలనను తుదముట్టించడంలోనూ పంజ్‌షేర్ ప్రాంతానిదే కీలక పాత్ర. అక్కడి ప్రజల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని మరింతగా రగిలించి వారికి మార్గదర్శకత్వం చేసిన వారిలో తాలిబన్ వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసూద్ కీలక వ్యక్తి. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు.
అయితే తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో అహ్మద్ షా మసూద్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన తనయుడు అహ్మద్ మసూద్.. తన తండ్రి పోరాట స్ఫూర్తితో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరు సాగిస్తూ వచ్చారు.
ఇదీ చూడండి: ఆ దేశాలతో పాక్ భేటీ- అఫ్గాన్ గురించి కీలక చర్చ
ఇదీ చూడండి: గర్భంతో ఉన్న మహిళా పోలీస్ దారుణ హత్య- తాలిబన్ల పనే!