అఫ్గానిస్థాన్‌లో తమ స్వాధీనంలోకి రాని ఏకైక ప్రాంతం పంజ్‌షేర్ కోసం తాలిబన్లు(panjshir afghanistan) ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఏకఛత్రాధిపత్యానికి కొరకరాని కొయ్యగా మారిన ఆ ప్రాంతాన్ని ఎలాగైనా తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు వారు చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడసికొడుతున్నాయి. అమెరికా దళాలు పూర్తిగా నిష్క్రమించడంతో త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు.. పంజ్‌షేర్‌ను(Taliban panjshi) కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా ఆ ప్రాంతం నేతలతో బుధవారం చర్చలు జరిపారు.
పర్వాన్ ప్రాంతంలో పంజ్‌షేర్‌కు చెందిన నేతలు, గిరిజన తెగలతో జరిపిన ఈ చర్చలు(panjshir taliban talks) విఫలమైనట్టు తాలిబన్ల ప్రతినిధి ముల్లా అమిర్ ఖాన్ ముత్తాకి మీడియాకు వెల్లడించారు. పంజ్‌షేర్ ఫైటర్లు ఆయుధాలు వీడి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పంజ్‌షేర్ లోయ ప్రజలే వారిని ఒప్పించాలని తాలిబన్లు సూచిస్తున్నారు.
'350మంది తాలిబన్లను మట్టుపెట్టాం'
మరోవైపు, తాలిబన్లను పంజ్‌షేర్(panjshir resistance) దళాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. పంజ్‌షేర్‌ను ఎలాగైనా వశం చేసుకొనేందుకు అక్కడ అడుగు పెట్టేందుకు ప్రయత్నించే క్రమంలో తాలిబన్లు వందల సంఖ్యలో తమ ఫైటర్లను కోల్పోయారు. మంగళవారం రాత్రి ఖవాక్ వద్ద జరిగిన యుద్ధంలో సహా ఇప్పటివరకు 350 మంది తాలిబన్ ఫైటర్లను మట్టుబెట్టినట్టు ఉత్తర కూటమి ప్రకటించింది. మరో 40మందికి పైగా తాలిబన్ ఫైటర్లను పట్టుకొని ఖైదు చేసినట్టు ట్విటర్‌లో తెలిపింది.
విమానాశ్రయం ధ్వంసం!
అఫ్గాన్ నుంచి ప్రజల తరలింపు నేపథ్యంలో పశ్చిమ దేశాల సైన్యాలు కాబుల్ విమానాశ్రయాన్ని ధ్వంసం చేశాయని తాలిబన్ నేత అనాస్ హక్కానీ అన్నారు. దీంతో విమానాశ్రయానికి పాత వైభవాన్ని తీసుకొచ్చేలా పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. త్వరలోనే ఇక్కడి నుంచి రాకపోకలు పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: అమెరికా దళాలు వెళ్లగానే.. పంజ్‌షేర్‌పై దాడికి యత్నం!