సిరియాలో తొలుత ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనగా ప్రారంభమైన చిన్న ఉద్యమం చివరకు అంతర్యుద్ధంగా మారింది. విదేశాలు జోక్యం చేసుకోవడం వల్ల పరిష్కారం కనిపించని సమస్యగా తయారైంది. సామాన్యులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. మౌలిక వసతులన్నీ ధ్వంసమయి దేశం మూడు దశాబ్దాలపాటు వెనక్కి పోయింది. విద్యుత్తు, చమురు ఉత్పత్తి దారుణంగా దెబ్బతింది.
ఈ యుద్ధంలో జరుగుతున్న నరమేధంపై బ్రిటన్‌లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ శనివారం విడుదల చేసిన నివేదికలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూశాయి.
ఉద్యమం యుద్ధంలా ఎలా మారింది?
అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు 2011 మార్చి 15న తీవ్రరూపం దాల్చాయి. దారా నగరంలో భారీ ప్రదర్శన జరిగింది. పౌరులు చేసిన ఈ పోరాటంలో తీవ్రవాదులు ప్రవేశించడం వల్ల యుద్ధంలా మారింది. అనంతరం జిహాదీ ఉగ్రవాదులు చేరి అంతర్యుద్ధానికి దారి తీసింది. ప్రభుత్వానికి రష్యా, ఇరాన్‌లు అండగా నిలిచాయి. ప్రభుత్వ వ్యతిరేకులకు అమెరికా, సౌదీ అరేబియా, టర్కీలు మద్దతు పలుకుతున్నాయి. ఉగ్రవాదులు దేశంలోని ఒకటో వంతు ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. గత తొమ్మిదేళ్లుగా పోరాటం కొనసాగుతునే ఉంది.
సామాన్యులంతా శరణార్థులే
తినడానికి తిండిలేని పరిస్థితుల్లో సామాన్య పౌరులు శరణార్థులుగా మారి ఇతర దేశాలకు అక్రమంగా వలసపోతున్నారు. హింసాత్మక ఘటనలు పెరగడం వల్ల గత కొద్ది వారాల్లోనే 2,84,000 మంది తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.
ఇదీ చదవండి: బాగ్దాద్‌లో అమెరికా దళాలపై రాకెట్ దాడి