అగ్రరాజ్యం అమెరికాతో ఇకపై ఎలాంటి చర్చలు జరపమని ప్రకటించారు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖొమైనీ. శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేశారు. అమెరికా సొంత అవసరాల కోసమే చర్చలను ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. 'ఈద్ అల్ అదా' సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖొమైనీ.. అమెరికా ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ స్వప్రయోజనాలనే చూసుకుంటుందని ఆరోపించారు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ విషయంలోనూ ఇలానే చేసిందని తెలిపారు ఖొమైనీ.
ఇదే కారణమా...
2018 మే నెలలో ఇరాన్, పాశ్చాత్య దేశాల మధ్య అణ్వాయుధ సంబంధిత చర్చలు జరుగుతున్నప్పుడు అమెరికా మధ్యలో వైదొలిగింది. అయినా ఒప్పందాలకు కట్టుబడి ఇప్పటికీ అమెరికా దళాలకు తమ అణుపరీక్షల స్థలాల్లోకి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు ఖొమైనీ. అణు కార్యక్రమాలకు స్వస్తి పలకడమే కాకుండా రక్షణ సౌకర్యాలు, ప్రాంతీయ అధికారాల్లోనూ అగ్రరాజ్యం చేయిదూర్చాలని చూసిందని ఆయన వెల్లడించారు.
అయితే బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమం మొదలుపెట్టినట్లు ముందుగా చెప్పలేదని.. అందుకే మధ్యలో ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు ట్రంప్ గతంలో వెల్లడించారు. ఎప్పటికీ ఇరాన్‌తో ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పిన డొనాల్డ్.. ఇస్లామిక్ రిపబ్లిక్ మీద మాత్రం తమ ఒత్తిడి కొనసాగుతుందని చెప్పారు. అమెరికా వైదొలగడం వల్ల అణు ఒప్పందంలో సభ్య దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, రష్యా ఇప్పటికీ తటస్థంగా ఉండిపోవాల్సి వచ్చింది.
ఆంక్షల వల్ల తీవ్రనష్టాలు...
ఇరాన్‌పై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడాన్ని తప్పుగా పరిగణించారు ఖొమైనీ. ఇరాన్ ప్రభుత్వం, ప్రజల మీద బలవంతంగా వాటిని అమలు చేశారని.. ఫలితంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఒకానొక సమయంలో ప్రభుత్వంపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు.
సబ్సిడీతో కూడిన గ్యాసోలిన్ ధరలు పెరగడం వల్ల.. నవంబర్ నెలలో ఇరాన్లో నాలుగు రోజులు పట్టణాలు, నగరాల్లో అశాంతి వాతావరణం నెలకొంది. పోలీసులు, భద్రతా దళాల కాల్పుల్లో దాదాపు 300 మంది ప్రజలు చనిపోయినట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. అయితే అశాంతి గురించిన అధికారిక గణాంకాలను ప్రభుత్వం మాత్రం విడుదల చేయలేదు. కానీ జూన్‌లో భారీగా నిరసనకారులు చనిపోయినట్లు ఇరాన్ సర్కార్ అంగీకరించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన 230 మంది.. ఘర్షణల్లో చనిపోయినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.