తూర్పు ఫిలిప్పీన్స్లో గోని తుపాను బీభత్సం సృష్టించింది. రాజధాని మనీలా వైపు కదులుతూ బలహీనపడిన క్రమంలో.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. బురదతో నిండిన వరదలో వందల ఇళ్లు తుడుచుపెట్టుకుపోయాయి. తుపాను విధ్వంసంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
కటండుయేన్స్ రాష్ట్రంలో గంటకు 280 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలతో ఈ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. గత వారం వచ్చిన తుపాను ధాటికి అతలాకుతలమైన ప్రాంతాలు నేటికీ కోలుకోలేదు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతలోనే మరో విపత్తు సంభవించింది. అల్బే ప్రాంతంలో తాజాగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు గవర్నర్ అల్ ఫ్రాన్సిస్ బిచారా.
గోని తుపాను.. ఆదివారం రాత్రి నాటికి బలహీనపడుతుందని తెలిపింది ఫిలిప్పీన్స్ వాతావరణ విభాగం. ఈ క్రమంలో 165 నుంచి 230 కిలోమీటర్ల మేర గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. అయితే తుపాను బలహీన పడినప్పటికీ ప్రమాదకరంగానే ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మందిని అత్యవసర శిబిరాలకు తరలించినట్లు విపత్తు స్పందన దళం వెల్లడించింది.
ఇదీ చూడండి: తూర్పు ఫిలిప్పీన్స్లో తుపాను బీభత్సం