ప్రజాస్వామ్య పరిరక్షణలో భారతీయులందరూ మాల్దీవులకు అండగా నిలుస్తారన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. విద్య, వైద్యం వ్యాపారాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని మాల్దీవుల పార్లమెంట్ 'పీపుల్స్ మజ్లిస్' వేదికగా ఆకాంక్షించారు.
మానవాళికి ఉగ్రవాదమే అతిపెద్ద సమస్య అన్నారు మోదీ. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి ఆర్థిక చేయుత అందించడం అతిపెద్ద సమస్యగా మారిందని పాకిస్థాన్‌పై పరోక్ష విమర్శలు చేశారు ప్రధాని.
"విద్య, వైద్యం, వ్యాపార రంగాల బలోపేతానికి జరిగిన ఒప్పందంతో మాల్దీవులకు మరింత చేరువయింది భారత్. పొరుగు దేశాలు సహకరించుకోవడంలో ప్రస్తుత ప్రపంచపు అనిశ్చిత పరిస్థితులు, గంభీరమైన ఎన్నికలను పరిగణనలోకి తీసుకోవాలి. అధునాతన సాంకేతికత, ఆర్థిక, సామాజిక రంగాల్లో వస్తున్న మార్పులు, అంతరిక్ష వ్యవహారాలు సహా వివిధ అంశాల్లో ఇరు దేశాలకు మధ్య అనేక వ్యవహారాలున్నాయి. కానీ రెండు దేశాలకు అత్యంత ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతున్నాను. ఉగ్రవాదం ప్రస్తుతం అతి పెద్ద సవాలు. ఒక దేశం, ఒక ప్రాంతామని కాదు.. మానవాళికంతటికీ ఉగ్రవాదం ఎంతో ప్రమాదకరం. ఉగ్రవాదం తన భయానక రూపాన్ని చూపి ప్రతి రోజూ సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఉగ్రవాదులకు సొంత బ్యాంకులు లేవు. కరెన్సీ ముద్రణ కేంద్రాలు లేవు. ఆయుధ ఫ్యాక్టరీలు కూడా లేవు. అయినప్పటికీ డబ్బు, ఆయుధాలు వారికేమీ తక్కువ కావడం లేదు. ఇవన్నీ వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎవరు ఈ సౌకర్యాలు ఇస్తున్నారు. దేశాలకు ఉగ్రవాదం అతిపెద్ద సమస్యగా మారింది. కానీ ఇప్పటికీ కొంతమంది మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులని వ్యాఖ్యానిస్తూ తప్పు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మానవతా వాదులంతా ఏకం కావడం అత్యావశ్యకం.
-మాల్దీవుల పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోదీ.