ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు శ్రీలంకకు భారత్ సహకారం కావాలన్నారు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే. భారత ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే దిశగా తమ సైన్యానికి శిక్షణ ఇవ్వడంలో భారత్ సాయం చేయాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు స్పష్టం చేశారు. మోదీ తమ దేశంలో పర్యటించడం వల్ల పర్యటక రంగం మళ్లీ ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీలంకలో పర్యటించిన మోదీ
భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ గత ఆదివారమే శ్రీలంకలో పర్యటించారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనతో పాటు ప్రధాని విక్రమ సింఘేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు కలిసి కృషి చేయాలని ఇరు దేశాల నేతలు తీర్మానించారు. శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన జరిగిన దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్ర దాడులతో శ్రీలంక స్ఫూర్తి చెక్కుచెదరలేదని, మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని ఆకాంక్షించారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మహీంద రాజపక్సతోనూ మోదీ భేటీ అయ్యారు. అనంతరం తమిళ జాతీయ కూటమి (టీఎన్ఏ) అధికారిక బృందంతో సమావేశమయ్యారు.
ఇదీ చూడండి : గవర్నర్ పదవిపై సుష్మా స్వరాజ్ స్పష్టత