రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీకు ఇప్పటికే 26 దేశాలు ఆమోదం తెలిపాయని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) వెల్లడించింది. తాజాగా మోంటెనెర్గో, సెయింట్ విన్సెంట్, గ్రెనాడైన్స్ దేశాలు స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఫలితంగా.. ప్రపంచంలో అత్యధిక దేశాల అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్‌లలో స్పుత్నిక్-వీ తొలిస్థానంలో నిలిచిందని ప్రకటించింది ఆర్‌డీఐఎఫ్.
అయితే.. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసుకున్న సంస్థగా స్పుత్నిక్ ఇదివరకు ప్రకటించుకుంది. అంతేకాకుండా అత్యవసర వినియోగం కింద రష్యాలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టింది. కానీ.. వ్యాక్సిన్ అనుమతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడం వల్ల.. వాటిని తీసుకునేందుకు అక్కడి ప్రజలు వెనుకడుగు వేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటివరకు అక్కడ 22లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ పొందినట్టు తెలిపాయి. అయితే.. ఆర్‌డీఐఎఫ్ తయారుచేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు లాన్సెట్ నివేదిక ఇటీవల పేర్కొంది. దాదాపు 92శాతం సమర్థత చూపించినట్లు స్పుత్నిక్ ఇదివరకే ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లో..
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే చాలా దేశాల్లో అందుబాటులోకి వస్తోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. 76 దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు మొత్తం 15.9 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకోగా.. ప్రపంచవ్యాప్తంగా నిత్యం 50 లక్షల మంది టీకా తీసుకుంటున్నట్లు సమాచారం. అమెరికాలో అత్యధికంగా 4.8 కోట్ల డోసులను అందజేసినట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకు ఫైజర్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌తో పాటు భారత్ బయోటెక్ తయారుచేసిన టీకాలు అధిక సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి.
అమెరికా తర్వాత కొవిడ్ టీకాను వేగంగా అందిస్తోన్న దేశాల్లో చైనా కూడా ముందుంది. ఇప్పటికే అక్కడ దాదాపు 4కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు సమాచారం. అటు.. యూరోపియన్ యూనియన్‌లో దాదాపు 2కోట్ల మంది టీకా తీసుకోగా.. బ్రిటన్‌లో కోటిన్నర మందికి వ్యాక్సిన్ అందించారు. భారత్‌లోనూ ఇప్పటివరకు 75 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చదవండి: అపరిచితురాలైన ఆమెలో 25 మంది.!