కిమ్ జోంగ్ ఉన్‌కు ఎలాంటి సర్జరీ గానీ, వైద్య చికిత్స గానీ జరగలేదని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. ఆయన అనారోగ్యంగా ఉన్నారని వస్తున్న వార్తలను తోసిపుచ్చింది.
20 రోజుల అజ్ఞాతం తర్వాత ప్యాంగ్యాంగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు కిమ్. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరకొరియా ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. కిమ్ మరణించారన్న వదంతులకు చెక్ పెట్టింది.
కిమ్ ప్రత్యక్షమైనప్పటికీ ఆయన అనారోగ్యంపై మాత్రం ప్రచారం ఆగడం లేదు. ఆయన నడస్తున్నప్పుడు అసౌకర్యంగా కన్పించారన్న విశ్లేషణలు వినిపించాయి. ఏదైనా సర్జరీ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే... ఉత్తర కొరియాపై ఎప్పుడూ నిఘా ఉంచే పొరుగదేశం దక్షిణ కొరియా ఆ వదంతులను తోసిపుచ్చింది.
కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లడం ఇదే తొలిసారి కాదు. 2014లోనూ 6వారాల పాటు ఎవ్వరికీ కన్పించలేదు. ఆ తర్వాత ప్రత్యక్షమైనప్పుడు కర్రసాయంతో నడిచి ఎలక్ట్రిక్ కార్ట్ వినియోగించారు. ఇప్పుడూ అదే తరహా వాహనాన్ని ఉపయోగించారు.