భారత సంతతికి చెందిన మలేసియా వాసి నాగేంద్రన్ ధర్మలింగానికి మాదక ద్రవ్యాల రవాణా కేసులో సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించింది. బుధవారం మరణదండన అమలు కావాల్సి ఉంది. ఇదే సమయంలో తన మానసిక స్థితి బాగా లేనందున మరణశిక్ష నిలిపివేయాలంటూ అతని తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. వాటిని తోసిపుచ్చిన న్యాయస్థానం అప్పీలుకు వెళ్లేందుకు ఒకరోజు అనుమతి ఇచ్చింది. మంగళవారం మలేసియా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో నాగేంద్రన్‌కు కొవిడ్-19 నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు తెలపటంతో బుధవారం అమలు చేయాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ముద్దాయికి కొవిడ్-19 నిర్ధారణ కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మరణశిక్ష గడియలు దగ్గరపడిన సమయంలో ఇది నిజంగా ఊహించని పరిణామమని అభిప్రాయపడింది. ముద్దాయికి కరోనా సోకినట్లయితే మరణశిక్ష అమలు చేయలేమని ఇలాంటి సమయాల్లో మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరముందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆండ్రూ ఫాంగ్ పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యేవరకు మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేసు విచారణను వాయిదావేశారు. దీంతో నాగేంద్రన్‌కు మరికొన్ని రోజులు ఊరట లభించింది.
ఉరిశిక్ష గడియలు సమీపించిన సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో నాగేంద్రన్ కేసుపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ప్రాంగణం మొత్తం అంతర్జాతీయ మీడియా, ఆందోళనకారులతో నిండిపోయింది. ఇప్పటికే నాగేంద్రన్ మరణశిక్షను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దాదాపు 70వేల మంది సంతకాలు చేశారు. మలేసియా ప్రధాని కూడా ఇదే అంశంపై సింగపూర్ ప్రధానికి లేఖ రాశారు. మానవ హక్కుల సంఘాలు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాయి. సింగపూర్‌కు 42గ్రాముల హెరాయిన్ సరఫరా చేశారని నాగేంద్రన్‌పై 2009లో మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో 2010లో మరణశిక్ష పడింది. ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరినా నిరాశే ఎదురైంది. 11ఏళ్ల క్రితంపడిన మరణశిక్ష ఈనెల 10వ తేదీన అమలు కావాల్సి ఉండగా.... ముద్దాయికి కొవిడ్ సోకడంతో మరణశిక్ష వాయిదా పడింది.
ఇదీ చదవండి: ఐవీఎఫ్‌లో పొరపాటు.. ఒకరి గర్భంలో మరొకరి శిశువు.. పుట్టిన 3 నెలలకు...