కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో చైనా నుంచి వస్తోన్న ప్రయాణికులను నిశితంగా పరీక్షిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ నేపథ్యంలో వుహాన్ నుంచి సింగపూర్ వచ్చిన ఓ జంట వైరస్ విషయంలో అబద్ధమాడింది. తమకు కరోనా వైరస్ సోకలేదని ఆ దేశ వైద్యులకు నమ్మబలికింది. అనుమానం వచ్చిన వైద్య బృందం.. వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.
ఈ విషయంలో తప్పుడు సమాచారమిచ్చారని ఆగ్రహించిన సింగపూర్ అధికార యంత్రాంగం ఆ దంపతులపై కేసు నమోదు చేసింది. వారికి వైరస్ సోకి ఎన్ని రోజులు అవుతుంది అనేదానిపై విచారణ చేపట్టారు అధికారులు. ఒకవేళ వారిపై అభియోగాలు రుజువైతే 7,150 యూఎస్ డాలర్ల వరకు జరిమానాతో సహా ఆరునెలల జైలుశిక్ష విధిస్తామని తెలిపారు.
సింగపూర్లో 100 కేసులు..
ఇప్పటిదాకా సింగపూర్లో సుమారుగా 100 మందికి కరోనా వైరస్ సోకిందని అక్కడి అధికారులు తెలిపారు. వేగంగా విస్తరిస్తోన్న వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశంలో సందర్శకుల ప్రవేశాలపై ఆంక్షలు విధించారు.
ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా ధాటికి.. ఇప్పటికే చైనాలో 2,800 మంది వరకు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 81 వేలకు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: విషాదంతో ముగిసిన ట్యూస్డే ఫ్యాట్ ఉత్సవాలు