ఏ ఇద్దరు కలిసినా ఆప్యాయతతో పలకరించుకునే తీరు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కొందరు కరచాలనం చేస్తే.. ఇంకొందరు చేతులు కలుపుతూ చప్పట్లు కొట్టుకుంటారు. ఇంకొందరు హత్తుకుని ఆలింగనం చేసుకుంటారు. మరికొందరు బుగ్గలమీద, ముక్కులు కలిసేలా చుంబనాలు చేస్తారు. భారత్‌లోనైతే చేతులెత్తి నమస్కరిస్తారు. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలివి. కరోనా వైరస్ దెబ్బకు ఇవన్నీ రూపు మారిపోతున్నాయి. కొన్ని సంప్రదాయలకు ‘దూరంగా’ ఉండాలని అంతర్జాతీయంగా వైద్య, ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి.
చైనా : చేతులు జోడించి..
కరచాలనం వద్దేవద్దని.. దీనికి బదులు చేతులు జోడించి పలకరించుకోవడమే మేలని చైనా సూచిస్తోంది. లేదా హలో చెప్పడం కోసం ‘గాంగ్ షోవ్’ (ఒక అరచేతిలో మరో చెయ్యి పిడికిలిని అడ్డంగా పెట్టడం) విధానాన్ని అనుసరించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
ఇరాన్ : పాదచాలనం
ఇరాన్‌లో కరచాలనానికి బదులు పాదచాలనం చేసుకుంటున్నారు. బూట్లు ధరించిన కాళ్లను ఒకరినొకరు తాకించుకుని ఆత్మీయతను వెలిబుచ్చుకుంటున్నారు. ఈ కొత్త అలవాటుతో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వీడియోలూ ప్రసారం చేస్తున్నారు.స్నేహితుల్ని కలిసినపుడు మాస్కులు ధరించండని, జేబుల్లో చేతులు పెట్టుకోండని సూచిస్తున్నారు.
ఫ్రాన్స్ : కళ్లలోకి కళ్లుపెట్టి..
ఈ దేశంలో ఆత్మీయంగా ఏ ఇద్దరు పలకరించుకోవాలన్నా చెంపలపై ముద్దులు, కరచాలనాలు చేసుకునే సంప్రదాయం ఉంది. ఈ పద్ధతులు ఇక చాలించాలని.. వీటికి బదులు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటే సరిపోతుందని పత్రికలన్నీ ప్రచారం చేస్తున్నాయి.
ఆస్ట్రేలియా : వెన్నుతడితే చాలు
ముద్దులు పెట్టుకుంటూ, కరచాలనం చేసుకుంటూ ఆత్మీయతను చాటే పద్ధతి ఈ దేశంలోనూ ఉంది. దీనికి బదులు వీపుపై తట్టాలని న్యూసౌత్ వేల్స్ ఆరోగ్య మంత్రి సూచిస్తున్నారు. ఒకవేళ ముద్దు పెట్టాల్సి వస్తే ఎవరికి పెడుతున్నామో చూసుకుని జాగ్రత్తలు పాటించాలంటున్నారు.
జర్మనీ : చిరునవ్వుతోనే..
ఈ దేశంలో ఇప్పుడు ప్రముఖులు కూడా కరచాలనానికి ఇష్టపడటం లేదు. దీనికి బదులు మందహాసం, చేతులు గాల్లో ఊపడం వంటివి చేస్తున్నారు.
బ్రెజిల్ : అలా తాగొద్దు..
దక్షిణ అమెరికాలో విస్తృత ప్రజాదరణ పొందిన ఓ కెఫీన్ పానీయాన్ని (చిమారో) లోహపు గొట్టాల(మెటల్ స్ట్రాలు)తో తాగే అలవాటుంది. ఈ స్ట్రాలను ఒకరికొకరు మార్చుకుని తాగుతుంటారు. ఈ పద్ధతి వద్దని బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రజలకు స్పష్టంచేసింది.
యూఏఈ : గాల్లో చేతులూపండి
యూఏఈ, ఖతార్‌లలో ముక్కు-ముక్కు తాకించుకుని పలకరించుకునే సంప్రదాయం ఉంది. ఇకపై ఇలా చేయొద్దని, కరచాలనమూ వద్దని ప్రచారం చేస్తున్నారు. దీనికి బదులుగా గాల్లోకి చేతులుపుతూ పలకరించుకోవాలని యూఏఈ ప్రభుత్వం సూచించింది.