ఇష్టానుసారం చెట్లను నరికివేస్తుండడం వల్ల పట్టణాలు ఎడారులుగా మారుతున్నాయి. పచ్చదనం కరవవుతోంది. పట్టణాల్లో కాలుష్యం, ఉష్టోగ్రతలు పెరిగి పోతున్నాయి.
అందుకే పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాడు పాకిస్థాన్లోని పర్యావరణ వేత్త షాజాద్ ఖురేషీ.
పాకిస్థాన్లోని కరాచీ పట్టణంలో అర్బన్ ఫారెస్ట్ పేరుతో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో చిన్నపాటి అడవిని సృష్టించారు. 10వేల మొక్కలను నాటారు. బంజరు భూమిలోనూ అడవులు పెరిగేలా చేయడమే ఈ అర్బన్ ఫారెస్ట్ ప్రత్యేకత.
మూడేళ్ల క్రితం షాజాద్ ఖురేషీ నాటిన మొక్కలు ఇప్పుడు అడవిగా మారి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. షాజాద్ ఎంచుకున్న ఈ పద్ధతి ప్రకారం మొక్కలు పెరిగేందుకు కనీసం మూడేళ్లు పడుతుంది.
పట్టణాల్లో అడవులు పెంచడం నిజమైన సమస్యకాదని... ఇక్కడ చెట్ల పెంపకం సాధ్యమేనని ప్రజలు నమ్మడమే అసలు సమస్య అంటున్నారు ఖురేషి.
"ఈ విధానంతో ఇంటి ముందు... ఇంటి వెనక ఇలా ఏదైన ఖాళీ స్థలాన్ని అడవిగా మార్చొచ్చు. ఏ ప్రాంతంలో అయితే మానవులు ఎక్కువగా ప్రవేశించరో అదే అసలైన అడవి" - షాజాద్ ఖురేషీ పర్యావరణవేత్త
ప్రస్తుతం ఆయన ప్రభుత్వ భాగస్వామ్యంతో పని చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 25 భారీ పరిమాణంలోని పార్కులను అడవులుగా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
పట్టణాల్లో కాలుష్యం తగ్గాలంటే మొక్కలు నాటడమే పరిష్కారమని... ఇందుకు ఖురేషీ ఎంచున్న అర్బన్ ఫారెస్ట్ విధానం ఫలితాలనిస్తోందని కరాచీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జాఫర్ ఇక్బాల్ శామ్స్ అంటున్నారు.
ఇప్పటికే ఖురేషి అర్బన్ ఫారెస్ట్ విధానంతో కొన్ని ప్రైవేటు సంస్థలు మంచి ఫలితాలను సాధించాయి.