కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా జరిగిన షాంఘై సహకార సమితి సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశం పాకిస్థాన్‌పై మాటల దాడికి దిగారు. ఉగ్రవాదానికి ప్రోత్సాహం, ఆర్థికసాయం అందిస్తోన్న దేశాలను బాధ్యులుగా నిలబెట్టాలని స్పష్టం చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సమక్షంలోనే ఆ దేశంపై పరోక్ష విమర్శలు చేసిన మోదీ... ఉగ్రవాద రహిత సమాజం కోసం భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ఉగ్రవాదంపై పోరులో ఎస్సీఓ సంకల్పం, సిద్ధాంతాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. తీవ్రవాదంపై పోరుకు ప్రపంచ దేశాలన్నీ ఏకంకావాలని పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధి, ప్రత్యామ్నాయ ఇంధనం, ఆరోగ్య పరిరక్షణ కోసం ఎస్సీఓ సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన అన్నారు.
ఎస్సీఓ ప్రాంత పరిధిలో శాంతి, ఆర్థికాభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందన్నారు మోదీ. సభ్యదేశాలు సాహిత్యం, సంస్కృతి, అభివృద్ధి అంశాల్లో సహకరించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రాంతీయ సమగ్రతను కాపాడాలి..
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా నిర్మిస్తోన్న చైనా-పాక్ ఆర్థిక కారిడార్ గురించి మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ప్రతిదేశం తమ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను గౌరవించుకోవాలని సూచించారు. ఏకపక్ష విధానాలు, రక్షణవాదం ఎవరికీ మేలు చేయవని మోదీ ఘాటు విమర్శలు చేశారు.
మోదీ... హెల్త్ సూత్రం..
ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత వ్యాపార విధానాల ద్వారా పనిచేసుకోవాలని మోదీ సూచించారు. భారత్ పెద్ద ఎత్తున సౌర, పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోందన్న మోదీ.. తాము వాతావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీఓ దేశాల మధ్య సయోధ్య కోసం మోదీ 'హెల్త్' అనే ఆంగ్లపదాన్ని విశదీకరిస్తూ నూతన అర్థం చెప్పారు.
"ఎస్సీఓ ప్రాంతంలో ఆరోగ్యకరమైన పోటీని బలోపేతం చేయడమే మన లక్ష్యం కావాలి. మన మధ్య సయోధ్య కోసం ఆంగ్లపదం 'హెల్త్'తో ఒక చక్కని మాట వస్తుంది. ఇందులో 'హెచ్' అంటే ఆరోగ్య పరిరక్షణలో సహకారం, 'ఈ' అంటే ఆర్థిక సహకారం, 'ఏ' అంటే ప్రత్యామ్నాయ ఇంధనం, 'ఎల్' అంటే సాహిత్యం, సంస్కృతి, 'టీ' అంటే ఉగ్రవాద రహిత సమాజం, హెచ్ అంటే మానవతాపూర్వక సహకారం."- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
ఇదీ చూడండి: బిష్కెక్లో మోదీ-ఇమ్రాన్ సరదా సంభాషణ