కశ్మీర్ అంశంపై చర్చించేందుకు 'ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ)' సభ్య దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తోంది సౌదీ అరేబియా. ఓఐసీ స్థానంలో సౌదీ నేతృత్వంలో మరో నూతన సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల.. మలేషియాలో నిర్వహించిన సదస్సును పాకిస్థాన్ బహిష్కరించింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ను సంతృప్తి పరిచేందుకు కశ్మీర్ అంశాన్ని ముందుకు తెస్తోంది సౌదీ.
కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఓఐసీ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ఎదిరుచూస్తున్నట్లు స్పష్టం చేశారు పాక్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషీ. కశ్మీర్ సమస్య, నియంత్రణ రేఖ వెంట భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయంపై తగిన వేదికల్లో లేవనెత్తుతున్నట్లు తెలిపారు.
మలేషియా సదస్సుపై పాకిస్థాన్‌కు వివరించేందుకు ఇటీవలే పాక్‌లో పర్యటించారు.. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాద్. ఈ సందర్భంగా కశ్మీర్ సమస్య, ఆర్టికల్ 370 రద్దు, భారత్‌లోని మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వంటివి చేపట్టారని.. ఫైసల్‌కు వివరించినట్లు వెల్లడించారు ఖురేషీ.
2020 ఏప్రిల్‌లో..
కశ్మీర్ అంశంపై చర్చించేందుకు ఓఐసీ మంత్రుల స్థాయి సమావేశం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 2020, ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
ఓఐసీ..
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో పాకిస్థాన్ సహా.. 57 ముస్లిం మెజారిటీ దేశాలు ఉన్నాయి. ఓఐసీని 1969లో ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం గళం వినిపించటం, ముస్లిం దేశాల మధ్య శాంతి, సామరస్యతను పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌కు ఓఐసీ ఎంతో మద్దతుగా నిలుస్తోంది.