ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి అనేక ఛానెల్స్, యాప్స్, సోషల్ మీడియా ఖాతాలు, పేజీలను మనం చూస్తూనే ఉంటాం. వాటిల్లో సేల్స్‌పర్సన్లు వస్తువు గురించి వివరిస్తూ అమ్మే ప్రయత్నం చేస్తుంటారు. మీరూ చూసి/కొనుగోలు చేసే ఉంటారు కదా. అలాగే చైనాలోనూ 'టవోబవో' పేరుతో చైనీస్ షాపింగ్ యాప్ ఉంది. అలీ బాబా గ్రూపునకు చెందిన ఈ యాప్‌లో సోషల్‌మీడియా బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్ లీ జియాకి వస్తువుల గురించి తెలియజేస్తూ విక్రయిస్తుంటాడు. మహిళలు వాడే లిప్‌స్టిక్స్‌ను అమ్మడంలో లీ దిట్ట. అందుకే అతడు 'కింగ్ ఆఫ్ లిప్‌స్టిక్స్', 'లిప్‌స్టిక్ బ్రదర్'గా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. అయితే, తాజాగా లీ ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయల విలువ చేసే వస్తువుల్ని విక్రయించి రికార్డు సృష్టించాడు.
అలీబాబా సంస్థ ఏటా యాన్యువల్ షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహించి భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. ఈ నేపథ్యంలో లీ జియాకి ప్రత్యక్షప్రసారం ద్వారా ఒక్క రోజులోనే లోషన్స్ నుంచి యాపిల్ ఎయిర్‌పాడ్స్ వరకు రూ.14.23 వేల కోట్లు విలువ చేసే వస్తువుల్ని విక్రయించాడు. దీంతో చైనాలో అతడి పేరు మరోసారి మార్మోగిపోయింది. గతంలోనూ ఐదు నిమిషాల్లో 15వేల లిప్‌స్టిక్స్‌ను అమ్మి అందరినీ ఔరా అనిపించాడు. 2019లో మోడల్స్‌కు 30 సెకన్లలో అత్యధిక లిప్‌స్టిక్స్ రాసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించాడు. అతడి సేల్స్ స్కిల్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. డౌయిన్ (చైనీస్ టిక్‌టాక్)లో లీకి 4 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమ్మకానికి పెట్టిన వస్తువుల గురించి తను నిజాయతీగా వివరిస్తాడు. ఏవైనా వస్తువులు బాగలేకపోతే.. తనే వాటిని కొనుగోలు చేయొద్దని సూచిస్తాడట. అందుకే లీ కొనుగోలుదారుల నమ్మకాన్ని, మనసును గెలుచుకున్నాడు.
ఇదీ చూడండి : Biden Taiwan: తైవాన్‌పై అమెరికా- చైనా మాటల యుద్ధం