కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్.. ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. తాజాగా ఒమిక్రాన్ బాధిత దేశాల జాబితాలో రష్యా, నేపాల్ కూడా చేరాయి. రష్యాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. నేపాల్‌లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది.
దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారికే..
Omicron in Russia: రష్యాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 10 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వారిలో ఇద్దరు ఒమిక్రాన్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. మిగిలినవారి నమూనాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్ బాధితులందరినీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో పెట్టి.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆ దేశం నుంచి వచ్చిన విదేశీయులపై ఆంక్షలు విధించింది రష్యా. 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి చేసింది.
రష్యాలో ఆదివారం ఒక్కరోజే 32 వేలకుపైగా కొవిడ్ కేసులు వెలుగుచూడగా.. 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్‌లో ఒమిక్రాన్ కలకలం
Omicron in Nepal: నేపాల్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ విదేశీయుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలగా.. అతనికి సన్నిహితంగా ఉన్న నేపాలీకి వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ విదేశీయుడు నవంబరు 19న నేపాల్‌కు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
15 దేశాల ప్రయాణికులపై పాక్ నిషేధం
ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 15 దేశాల ప్రయాణికులపై పాకిస్థాన్ నిషేధం విధించింది. అయితే కొన్ని షరతులతో అత్యవసరాలకు మినహాయింపు ఇచ్చింది. మరో 13 దేశాలపై ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేసింది.
ఒమిక్రాన్ నివారణకు ముందు జాగ్రత్త చర్యగా.. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వ్యాధి ప్రొఫైల్, హెల్త్ ప్రొటోకాల్‌ల ఆధారంగా ప్రపంచ దేశాలను ఏ,బీ,సీ వర్గాలుగా విభజించింది పాక్. దీని ప్రకారం సీ కేటగిరీ దేశాల నుంచి ప్రయాణికులను నిషేధించింది. క్రొయేషియా, హంగేరీ, నెదర్లాండ్స్, ఉక్రెయిన్, ఐర్లాండ్, స్లోవేనియా, వియత్నాం, పోలాండ్, దక్షిణాఫ్రికా, మొజాంబిక్, లెసోతో, ఎస్వాటిని, బోట్స్వానా, జింబాబ్వే, నమీబియా దేశాలు కేటగిరీ 'సీ'లో ఉన్నాయి. ఏ, బీ కేటగిరీ దేశాలపై ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేసింది.
ఇదీ చూడండి: 'ఒమిక్రాన్.. డెల్టా కంటే డేంజర్ ఏం కాదు!'