Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య పదకొండో రోజుకు చేరింది. రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యన్ సేనలు క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. కీవ్‌పై పట్టు కోసం పుతిన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రేనియన్ దళాలు ప్రతిఘటిస్తుండటంతో మాస్కో బలగాలు కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికే రెండు అణు విద్యుత్ కేంద్రాలను ఆదీనంలోకి తీసుకున్న రష్యా దళాలు ఇప్పుడు మరో అణువిద్యుత్ కేంద్రంపై దృష్టి సారించాయి. చెర్నోబిల్, జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఇప్పటికే పుతిన్ సేనల ఆధీనంలో ఉండగా మూడో అణువిద్యుత్ కేంద్రమైన యుజ్నౌక్రైన్స్క్‌ను స్వాధీనంచేసుకునే దిశగా రష్యా అడుగులు వేస్తోంది. ఈ అణువిద్యుత్ కేంద్రం ఉన్న మైకోలైవ్ పట్టణానికి ఉత్తరంగా 120 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఎయిర్ పోర్టులతోపాటు అన్ని ప్రాంతాల్లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందని ఆరోపించారు. నల్ల సముద్రం తీరప్రాంతంలోని ఒడెస్సా నగరంపై మరోసారి బాంబుదాడులు చేసేందుకు రష్యా బలగాలు సిద్ధమవుతున్నాయని జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించాలని జెలెన్‌స్కీ మరోసారి నాటో దేశాధినేతలను కోరారు.
ధీటుగా బదులిస్తున్నాం..
గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఎనిమిది యుద్ధ విమానాలు, రెండు మిలిటరీ హెలికాప్టర్ లను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మరో ఆరు డ్రోన్లను కూల్చినట్లు తెలిపింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వంద మైళ్ల పరిధిలోనే ఇదంతా జరిగినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ కీలక వైమానిక స్థావరాన్ని సైతం ధ్వంసం చేసినట్లు రష్యా వెల్లడించింది. మరోవైపు రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యాబలగాలు సెంట్రల్ విన్నిస్తియాలోని ఎయిర్ పోర్టును ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.రష్యా క్షిపణి దాడిలో విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారు.
రష్యా గుప్పిట్లో నాలుగు లక్షల మంది ఉక్రెయిన్లు..
మరియుపొల్‌లో చిక్కుకున్న పౌరులను తరలించేందుకు మానవతా కారిడార్ కింద ఆదివారం కాల్పుల విమరణ పాటించాలని ఉక్రెయిన్, రష్యా నిర్ణయించినా అది మరోసారి విఫలమైంది. దీనికి కారణం మీరంటే మీరంటూ ఇరుపక్షాలు ఆరోపించుకున్నాయి. మరియుపోల్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టగా సుమారు 4 లక్షల మంది పౌరులు ఆ నగరంలో చిక్కుకున్నారు.
జెలెన్స్కీతో బైడన్ చర్య...
మరోసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు రక్షణ, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య అరగంట పాటు చర్చలు జరిగినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌తోనూ ఫోన్‌లో మాట్లాడిన జెలెన్‌స్కీ తమ దేశానికి మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పనిచేస్తున్న ఏకైక కమ్యూనికేషన్ వ్యవస్థ స్టార్‌లింకే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు గుర్తు చేశారు.
ఇదే అతి పెద్ద సంక్షోభం..
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో 10రోజుల వ్యవధిలో 15 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడిచి సరిహద్దు దేశాలకు వెళ్లారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం ఇదేనని ఐరాస తెలిపింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడో విడత శాంతి చర్చలు సోమవారం జరగనున్నాయి.
పుతిన్ ఓడిపోవాలి.. జాన్సన్ ఆరు అంశాల ప్రణాళిక విడుదల
ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఓడించేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఆరు అంశాల ప్రణాళికను ప్రకటించారు.
- ఉక్రెయిన్ కోసం అంతర్జాతీయ మానవతా సాయాన్ని కూడగట్టాలి.
- ఉక్రెయిన్ తన స్వీయ రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలి.
- రష్యా పై ఆర్థిక ఒత్తిడి మరింత పెంచాలి.
- ఉక్రెయిన్‌లో రష్యా తాను చేస్తున్న పనులను సాధారణంగా పరిగణించడాన్ని అడ్డుకోవాలి.
- ఉద్రిక్తతల తగ్గుముఖం కోసం ప్రపంచ దేశాలు దౌత్యపరమైన మార్గాలను అనుసరించాలి. అదీ.. ఉక్రెయిన్ చట్టబద్ధమైన ప్రభుత్వ పూర్తి భాగస్వామ్యంతో మాత్రమే.
- యూరో అట్లాంటిక్ ప్రాంతంలో భద్రతను బలోపేతం చేసేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాలి.
రష్యాలో మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ సేవల నిలిపివేత...
ఉక్రెయిన్ పై ఆక్రమణకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపి వేశాయి. తాజాగా ఆ జాబితాలో మాస్టర్‌కార్డ్, వీసా కూడా చేరాయి. రష్యన్ బ్యాంకులు జారీ చేసిన కార్డులు తమ వ్యవస్థల్లో ఇకపై పనిచేయబోవని మాస్టర్ కార్డ్ ప్రకటించింది. ఇతర దేశాల్లో జారీ చేసిన తమ కార్డులు రష్యన్ స్టోర్లు, ఏటీఎంలలో పనిచేయవని తెలిపింది. వీసా కూడా తమ కార్డుల సేవల్ని నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇవి పరిమిత చర్యలు మాత్రమేనని పరిస్థితులు ఇలాగే కొనసాగితే... రానున్న రోజుల్లో మరింత కఠిన ఆంక్షలు ఉంటాయని రెండు సంస్థలూ హెచ్చరించాయి.
ఇవీ చూడండి:
అణుబాంబు తయారీకి ఉక్రెయిన్ ప్లాన్- అందుకే రష్యా దాడి?
రష్యా దాడులతో నిర్మానుష్యంగా కీవ్: ఉక్రెయిన్ ఎంపీ
వెనక్కి తగ్గి దెబ్బకొట్టడమే.. రష్యా వ్యూహమా?
Ukraine President: 'నన్ను సజీవంగా చూడడం ఇదే ఆఖరేమో'
యుద్ధభూమిలో ఉండలేక.. అయినవారిని వీడలేక.. ఉక్రెయిన్ ప్రజల భావోద్వేగం