కరోనాకు టీకా కనుగొనేందుకు జరుగుతున్న రేసులో ప్రపంచ దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఒకరిపై ఒకరు పోటీపడి మరీ వైరస్‌ను అభివృద్ధి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీన.. తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. ఇదే జరిగితే ప్రపంచంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా రష్యా చరిత్రలో నిలిచిపోనుంది.
"1957లో స్పుట్నిక్ పేరుతో అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తొలి ఉపగ్రహం రష్యాదే. అది చూసిన అమెరికన్లు షాక్‌కు గురయ్యారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. వ్యాక్సిన్ రేసులో ముందు రష్యా గమ్యాన్ని చేరుతుంది."
-- కిరిల్ దిమిత్రీవ్, రష్యా సార్వభౌమ సంపద నిధి చీఫ్.
రష్యాకు చెందిన గమలేయ ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే.. ప్రజలు టీకాను వినియోగించవచ్చు. అయితే ముందుగా వ్యాక్సిన్లను ఆరోగ్య సిబ్బందికి అందివ్వాలని చూస్తోంది రష్యా.
నివేదికల ప్రకారం.. రష్యా వ్యాక్సిన్ రెండో దశ పూర్తి చేసుకోలేదు. ప్రపంచంలోని చాల పరిశోధనలు ఇప్పటికే మూడో దశకు చేరుకోవడం గమనార్హం.