Russia nuclear drills: అణ్వాయుధ వ్యవస్థల అప్రమత్తతకు అధ్యక్షుడు పుతిన్ ఆదేశించిన నేపథ్యంలో రష్యా సైన్యం ఆ దిశగా సన్నాహాలను ముమ్మరం చేసింది. ఏ క్షణంలోనైనా అణుదాడికి దిగటానికి అనుకూలంగా సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగా విన్యాసాల కోసం అణు జలాంతర్గాములను బేరెంట్స్ సముద్ర జలాల్లోకి తరలించారు. సైబీరియా మంచు అడవుల్లో సంచార క్షిపణి ప్రయోగ వ్యవస్థలను మోహరించారు. సముద్ర జలాల్లో నిర్వహించే విన్యాసాల్లో పలు అణు జలాంతర్గాములు పాల్గొంటాయని రష్యాకు చెందిన నార్తర్న్ ఫ్లీట్ మంగళవారం ప్రకటించడం గమనార్హం.
కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ చక్కగా పనిచేసేలా వీటిని సిద్ధంగా ఉంచడమే విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. పలు నౌకా స్థావరాలు ఉన్న కోలా దీవి చుట్టూ యుద్ధ నౌకలను రంగంలోకి దించినట్లు వెల్లడించింది. యుద్ధ నౌకలు కూడా విన్యాసాలు నిర్వహించనున్నాయి. సైబీరియాలోని ఇర్కుత్స్క్ ప్రాంతంలో అడవుల్లోకి ఖండాంతర క్షిపణుల ప్రయోగ వ్యవస్థలను సైనిక బలగాలు తరలించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా, రష్యాల వద్ద అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్న విషయం తెలిసిందే. ఒక దేశం అణ్వాయుధాలతో దాడికి సన్నద్ధమవుతుందంటే అనివార్యంగా రెండో దేశం కూడా అప్రమత్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు మరింతగా విస్తరించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
అణు యుద్ధానికి భయపడొద్దు: బైడెన్
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య.. అణుయుద్ధానికి దారితీస్తుందన్న భయం అక్కర్లేదని అమెరికా అధ్యక్షుడు జో బైెడెన్ అభయమిచ్చారు. ఉక్రెయిన్‌పై దాడులు ఖండిస్తూ.. పశ్చిమాసియా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన క్రమంలో.. పుతిన్ తన అణు బలగాలను అప్రమత్తం చేశారు. దీంతో అణుయుద్ధం తప్పక పోవచ్చన్న ఆందోళన అమెరికన్లలో తీవ్రంగా వ్యక్తం అవుతుంది. ఈ విషయంపై అధ్యక్షుడు బైడెన్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన అన్నారు.
నాటో అణ్వాయుధ అప్రమత్తతలో మార్పులు అవసరం లేదు : స్టోల్టెన్‌బర్గ్
అణ్వాయుధాలకు సంబంధించి రష్యా బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో నాటో దేశాల 'అణ్వాయుధ శక్తి అప్రమత్తత స్థాయి'లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని కూటమి సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు. పోలండ్‌లోని లాస్క్ వైమానిక స్థావరం వద్ద ఆయన 'ఏపీ' వార్తాసంస్థతో మంగళవారం మాట్లాడారు. ''నాటో సభ్య దేశాల రక్షణకు ఏం చేయాలో.. దాన్ని నిరంతరం చేస్తుంటాం'' అని స్పష్టం చేశారు. దౌత్య ప్రయత్నాల పట్ల రష్యా విశ్వాసం ఉంచాలని, దాడులను నిలిపివేసి తన సైన్యాలను ఉపసంహరించాలని సూచించారు. అనంతరం ఆయన బాల్టిక్ ప్రాంత భద్రతకు సంబంధించి చర్చలు జరిపేందుకు ఎస్తోనియా రాజధాని టాలిన్‌కు వెళ్లారు.
ఇదీ చూడండి: 'కీవ్' లక్ష్యంగా రష్యా దూకుడు.. 65 కి.మీ. పొడవున మోహరింపులు