అఫ్గాన్ రెసిస్టెన్స్ ఫోర్స్ దళాల నాయకుడు అహ్మద్ మసూద్ (Ahmad Massoud) దేశంలోనే ఉన్నారని ఇరాన్ అధికారిక వార్త సంస్థ ఫార్స్ న్యూస్ పేర్కొంది. తాలిబన్ దాడుల(Afghanistan Taliban) నేపథ్యంలో మసూద్ అహ్మద్ టర్కీకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం మసూద్ సురక్షితమైన ప్రదేశంలోనే ఉంటూ.. పంజ్‌షేర్ లోయతో (Panjshir news) సంబంధాలు నెరుపుతున్నారని ఫార్స్ పేర్కొంది. ఈ లోయలోని 70శాతం ప్రధాన రహదారులు తాలిబన్ల అధీనంలోకి వచ్చేశాయి. దీంతో తాలిబన్లు ప్రావిన్స్ మొత్తాన్ని గెల్చుకొన్నట్లు ప్రచారం చేసుకొంటుండగా.. ఎన్‌ఆర్‌ఎఫ్ దళాలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాయి.

అక్కడి పరిస్థితిపై అహ్మద్ మసూద్ (Ahmad Massoud) సన్నిహితుడు ఖాసీం మహమ్మదీ మాట్లాడుతూ ''ఇటీవలి కాలంలో తాలిబన్లు పంజ్‌షేర్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం 70శాతం రహదారులు వారి అధీనంలోకి వెళ్లాయి. కానీ, కీలకమైన పంజ్‌షేర్ లోయలు మాత్రం ఎన్‌ఆర్ఎఫ్ దళాల అధీనంలోనే ఉన్నాయి.'' అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఎఫ్ దళాలు లోయలోని కీలక ప్రాంతాల్లో ఉన్నాయి. పంజ్‌షేర్ లోయ భౌగోళికంగా దుర్భేద్యంగా ఉంటుంది. దీంతో గత నాలుగు రోజుల నుంచి పోరాటం తీవ్రమైంది. ఇరువైపులా భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు వార్తలొస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీన కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించుకొన్నాక ఒక్క పంజ్‌షేర్ మినహా దేశం మొత్తం పట్టు సాధించారు. గత సోమవారం అహ్మద్ మసూద్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: 'పంజ్‌షేర్'పై తాలిబన్లు గెలిచారా? అసలు నిజం ఇదీ...