భారత్‌తో సరిహద్దు వివాదంలో వెనక్కి తగ్గబోమన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి నెమ్మదించారు. భారత నిఘా సంస్థ చీఫ్ సామంత్ కుమార్ గోయల్‌తో బుధవారం జరిగిన భేటీ అనంతరం ఆయన వైఖరిలో మార్పు కన్పిస్తోంది. విజయ దశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నేపాల్ పాత్ మ్యాప్‌ను ఆయన ట్వీట్ చేయడం గమనిస్తే ఈ విషయం అర్థమవుతోంది.
భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే వచ్చే నెలలో నేపాల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే సామంత్‌తో బుధవారం తన నివాసంలో భేటీ అయ్యారు ఓలి. అయితే ఆయనలో వచ్చిన మార్పు తాత్కాలికమో లేక శాశ్వతమో కొద్ది రోజుల్లో తెలిసిపోనుంది. ఇది నిజమైతే భారత్- నేపాల్ మధ్య స్నేహ సంబంధాలు మళ్లీ పూర్వ స్థితికి వచ్చే అవకాశాలున్నాయి.
పాతమ్యాప్ కాదు..
భారత్‌లోని మూడు భూభాగాలను తమవిగా చూపే కొత్త మ్యాప్‌ను నేపాల్ ప్రధాని ట్వీట్లో ఉపయోగించకపోవడం వల్ల నెటిజెన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆ దేశ ప్రధాని కార్యాలయం స్పందించింది. ఓలీ ట్వీట్లో పాత మ్యాప్‌ను ఉపయోగించలేదని.. చిత్రం చిన్నగా ఉన్నందు వల్ల దాన్ని సరిగ్గా చూడలేకపోతున్నారని వివరణ ఇచ్చింది.