ఉపవాసాలు, ప్రార్థనలతో పాటు పవిత్ర రంజాన్ మాసం అంటే గుర్తొచ్చేవి నోరూరించే ప్రత్యేక వంటకాలు, షాపింగ్. పాకిస్థాన్‌లో రంజాన్ సందడి మరింత ఎక్కువ. రంజాన్ మాసంలో రాత్రివేళ దాదాపు అన్ని ముఖ్య ప్రాంతాలు రద్దీగానే కనపడుతున్నాయి.
ఆహార ప్రియులు, షాపింగ్ చేసే వారితో రావల్పిండి వీధులు కళకళలాడుతున్నాయి. ఇక్కడ దొరికే గాజులతో పాటు 'నిరాహి' అనే ప్రత్యేక వంటకానికి ఎంతో క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా దీని కోసమే ప్రజలు క్యూ కడతారు. పథోర, కుల్చా, శేహ్రి వంటకాలను ఎంతో ఇష్టంగా తింటున్నారు.
ఇన్ని మసాల వంటకాలు తిన్న తర్వాత... చల్లటి లస్సీ తాగితే ఆ కిక్కే వేరని దుకాణదారుడు షరాఫట్ హుస్సేన్ అన్నాడు.
" ఇక్కడ దేశీయ పద్ధతుల్లో లస్సీని తయారు చేస్తాం. ఎటువంటి యంత్రాలను వినియోగించం. పెరుగును చిలుకుతుంటే వచ్చే సువాసన అందరినీ ఆకర్షిస్తుంది. దీని రుచే వేరుగా ఉంటుందని వారు అంటారు."
--- షరాఫత్ హుస్సేన్, దుకాణదారుడు.
రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఎంతో ప్రత్యేకం. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేదలకు ఉచితంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నాయి. వారి కళ్లల్లో ఆనందం చూస్తే మనసు ఎంతో హాయిగా ఉంటుందన్నారు ఓ స్వచ్ఛంద సహాయకుడు.
"తిండి లేని వారికి భోజనం పెడుతున్నప్పుడు వారి కళ్లలో ఆనందం కనిపిస్తుంది. రంజాన్ మాసంలో ఇలా చేయడం మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. అల్లా ఆశీర్వాదాలతో దీని నుంచి అందరూ లబ్ధిపొందాలని కోరుకుంటున్నా. "
--- అకీల్ అబ్బాస్, స్వచ్ఛంద సేవకుడు.
ఉపవాసాలు, షాపింగ్, ఇఫ్తార్ విందులు... ఇవే కాకుండా పాకిస్థాన్‌లో అటవిడుపులూ ఉంటాయి. అక్కడి యువత అర్ధరాత్రి దాటిన తర్వాత వివిధ ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతారు. ముఖ్యంగా క్రికెట్‌ను ఎంతో ఇష్టంగా ఆడతామని తెలిపారు.
ఇదీ చూడండి: నాలుగు నెలల్లో 61 మంది భద్రతా సిబ్బంది మృతి