తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ వి.ఫెంగీతో సమావేశమయ్యారు. షాంఘై సహకార సంఘం సదస్సుకు హాజరయ్యేందుకు రష్యా వెళ్లిన సందర్భంగా ఇరువురి మధ్య ఈ భేటీ జరిగింది.
సుదీర్ఘ చర్చ
ఈ ఏడాది మే నెలలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత.. ఇరు దేశాల రక్షణ మంత్రుల స్థాయిలో ముఖాముఖి ఉన్నత స్థాయి చర్చలు జరగడం ఇదే తొలిసారి. సుదీర్ఘంగా 2 గంటల 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించే అంశమే ప్రధాన ఎజెండాగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని పునరుద్ధరించాలని రాజ్‌నాథ్ గట్టిగా డిమాండ్ చేసినట్లు సమాచారం. యథాతథ స్ధితిని మార్చేందుకు చైనా చేస్తున్న యత్నాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
చైనాకు చురకలు..
అంతకు ముందు షాంఘై సహకార సంఘం రక్షణ మంత్రుల సదస్సులో ప్రసంగించిన రాజ్‌నాథ్ పరోక్షంగా చైనాకు చురకలు అంటించారు. షాంఘై సహకార సంఘం ప్రాంతంలో శాంతి, భద్రత ఉండాలంటే నమ్మకం కల్గించే వాతావరణం, దురాక్రమణ రహిత పరిస్ధితులు, అంతర్జాతీయ ఒప్పందాలపై గౌరవం, విభేదాల పరిష్కారానికి శాంతియుత తీర్మానం వంటివి ఉండాలని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఉదహరించిన రాజ్‌నాథ్.. అది దురాక్రమణ వల్ల కల్గే దుష్పరిణామాలను ప్రపంచానికి పాఠంగా చూపించిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'