పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందంటూ... గిల్గిత్ బాల్టిస్థాన్లో ఆందోళన నిర్వహించారు నిరసనకారులు. తప్పుడు ఆరోపణలు మోపి, అరెస్ట్ చేసిన హక్కుల సంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిత్ బాల్టిస్థాన్లో రాజకీయ స్థితిని మార్చాలని యత్నిస్తున్న పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు.
ప్రాణ త్యాగానికైనా..
పీఓకేలోని ముజఫరాబాద్ నగరంలో ఆదివారం.. జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ నేతలు.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. గిల్గిత్ బాల్టిస్థాన్కు రాష్ట్ర హోదా కల్పించాలని యత్నిస్తున్న పాక్ ప్రభుత్వం.. వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు.
"కారాగారాల్లో ఉన్న నేతలను విడుదల చేసేవరుకు మేం శాంతించం. మమ్మల్ని ఇదివరకే అరెస్ట్ చేశారు. అసీరన్-ఐ-హుంజా రిహాయ్ కమిటీ తదుపరి ఆదేశాల కోసం మేం ఎదురుచూస్తున్నాం. వాళ్లు మాకు పిలుపివ్వగానే.. పాకిస్థాన్ అంతటా మా నిరసనను ఉద్ధృతం చేస్తాం."
-- గిల్గిత్ బాల్టిస్థాన్ యూత్ అలైయన్స్ కమిటీ నేత
పాకిస్థాన్లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న గిల్గిత్ బాల్టిస్థాన్కు చెందిన ప్రజలు కూడా ఆందోళన బాటపట్టారు. గిల్గిత్ బాల్టిస్థాన్ను ఐదో రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది పాక్ ప్రభుత్వం. ఈ ప్రకటనతో.. గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి.
ఇదీ చూడండి:పాక్ ఆయుధ స్మగ్లింగ్ కుట్ర భగ్నం