న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్‌కు మళ్లీ పట్టం కట్టారు ఆ దేశ ప్రజలు. సాధారణ ఎన్నికల్లో ఆమెకు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. కరోనా నియంత్రణ, సామాజిక అసమానతల కట్టడిలో జెసిండా అద్భుతమైన పనితీరు వల్లే భారీ ఆధిక్యం సాధించారు. తాజా ఫలితాలతో మరో మూడేళ్లు జెసిండా ఆర్డెర్న్ ప్రధానిగా పనిచేయనున్నారు.
ఈ ఎన్నికల్లో 49 శాతం ఓట్లు జెసిండా పార్టీకే వచ్చాయి. 1930 నుంచి ఇదే భారీ మెజార్టీ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం కన్సర్వేటివ్ నేషనల్ పార్టీ 27 శాతం ఓట్లకే పరిమితమైంది. ఈ పార్టీ 2002 కంటే ఘోరమైన ఫలితాలను మూటగట్టుకుంది.
తొలిసారి..
కివీస్‌లో చాలా ఏళ్లుగా కూటములే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. 40 ఏళ్ల జెసిండా మొదటిసారి ఇదే తరహాలో అధికారం చేపట్టారు. అయితే ఈసారి సీన్ రివర్సయింది. తాజాగా ఎన్నికల్లో మాత్రం ఒక్క పార్టీకే భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. గత 50 ఏళ్లలో తొలిసారి ఇలా జరగడం విశేషం.
లేబర్ పార్టీ మొత్తం 120 సీట్లలో 64 స్థానాలు కైవసం చేసుకుంది. 1996 నుంచి అనుపాత ఓటింగ్ పెట్టాక ఏ పార్టీకి అయినా ఇదే అతిపెద్ద విజయం. 2017, సెప్టెంబర్ 23న ఏర్పాటైన కివీస్ పార్లమెంటు పదవీకాలం.. ఈ ఏడాది సెప్టెంబర్ 6తో ముగిసింది. పూర్తి ఫలితాలు, విజేతను అక్టోబర్ 30న అధికారికంగా ప్రకటిస్తారు.