పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జులై 22న వాషింగ్టన్లో సమావేశమవుతారని శ్వేతసౌధం ప్రకటించింది. ఈ భేటీలో ఇరువురు నేతలు.. ఉగ్రవాదం నిర్మూలన, దక్షిణాసియాలో శాంతిస్థాపన సహా పలు అంశాలపై చర్చిస్తారని తెలిపింది.
దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత్వం, ఆర్థిక శ్రేయస్సు సాధించే క్రమంలో... అమెరికా, పాకిస్థాన్ మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ఇరువురు నేతలు దృష్టి సారించనున్నారు.
"అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్... ఉగ్రవాద నిర్మూలన, రక్షణ, ఇంధనం, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. దక్షిణాసియాలో శాంతిస్థాపన కోసం ఇరుదేశాల మధ్య పరస్పరం సహకారం బలోపేతం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తారు."- శ్వేతసౌధం ప్రకటన
ఇమ్రాన్‌ఖాన్ మొదటి పర్యటన
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని పీఠం అధిరోహించిన తరువాత మొదటిసారి ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పాక్, అమెరికాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు.
అమెరికా పర్యటనలో ఇమ్రాన్‌ఖాన్ వెంట పాక్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ, ఇతర నాయకులూ వెళ్లనున్నారు.
ఐరాసలో ప్రాతినిధ్యం..
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 74వ సెషన్లో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఇమ్రాన్‌ఖాన్ సెప్టెంబర్‌లో న్యూయార్క్ వెళ్లనున్నారు. 2018 ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇమ్రాన్‌ఖాన్‌కు ఇదే మొదటి యూఎన్జీఏ సెషన్.
ఇదీ చూడండి: కోహ్లీ, ధోని అప్పుడు ఇప్పుడు ఒకేలా..!