గిల్గిత్-బాల్టిస్థాన్ వీధులు నిరసనలతో హోరెత్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి.. ఓ స్థానిక నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిందంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ ఘటనలో నాలుగు వాహనాలతో పాటు అటవీశాఖకు చెందిన ఓ భవనానికి నిప్పంటించారు ఆందోళనకారులు.
తొలుత.. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చెలరేగిందని.. ఆ పరిణామాలు హింసాత్మక ఘటనకు దారితీశాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని పేర్కొన్నారు.
అయితే హింసాత్మక ఘటనల్లో తమ కార్యకర్తలపై పోలీసులు బాష్పవాయును ప్రయోగించారని ఆరోపించింది పీపీపీ. ఈ నేపథ్యంలో అనేక మంది కార్యకర్తలు గాయపడ్డారని తెలిపింది.
గత వారంలోనూ పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంలో ఇదే తరహా నిరసనలు చెలరేగాయి. గిల్గిత్-బాల్టిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించిన ఆందోళనకారులు.. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
ఇదీ చూడండి:- 'ఇలా అయితే మేం పాకిస్థాన్ నుంచి వెళ్లిపోతాం!'