పిల్లల ఆలోచనా విధానంపై కుటుంబం, సమాజంతోపాటు ప్రకృతి ప్రభావం కూడా ఉంటుందని 'దక్షిణ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ' పరిశోధకులు వెల్లడించారు. పిల్లలు సర్వం ప్రకృతి ద్వారానే నేర్చుకుంటారంటున్న నిపుణులు.. వారిలో సామాజిక నైపుణ్యాలు మెరుగయ్యేందుకు ప్రకృతి ఎంతో సహకరిస్తుందని కొనియాడారు. ఆలోచనా విధానం, సత్ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు, సృజనాత్మకత ప్రకృతి ద్వారానే పెంపొందుతాయని పేర్కొన్నారు.
మరిన్ని విషయాలు...
2 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు పిల్లలపై.. ప్రకృతి ఏ మేర ప్రభావం చూపుతుందన్న అంశంపై పరిశోధనల అనంతరం సహ రచయిత కైలీ డాన్కివ్ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అడవి, రాళ్లు, బురద, పచ్చని తోటలు, చెరువులు, నీరు... తదితర 16 అంశాలపై సమీక్షించిన అనంతరం.. పిల్లల ఆరోగ్యం, పెరుగుదలపై వాటి ప్రభావాన్ని వివరించారు. పిల్లల శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యం, యాంత్రిక నైపుణ్యం, భావోద్వేగ అభివృద్ధి స్థాయిలను మెరుగుపరిచేందుకు ప్రకృతి సాయపడుతుందని స్పష్టం చేశారు.
'ప్రకృతిలో పిల్లలు ఆడుకోవడం ద్వారా వారి శారీరక సామర్థ్యాలు, సమతుల్యత, ఫిట్నెస్ పెంపొందుతాయి. సమూహాలుగా చేరడం వల్ల స్నేహపూర్వక వాతావరణంతో సహా.. సంధి, భాగస్వామ్య అంశాలు మెరుగవుతాయి. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాల్ని కాపాడుకునేందుకు దోహదపడతాయి.'
- కైలీ డాన్కివ్, యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా
ఇదీ చదవండి: పక్షులకు పొంచి ఉన్న ముప్పు... నెమళ్లు సేఫ్