భారత్ నుంచి పత్తి, నూలు దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఆ దేశ ఆర్థిక సమన్వయ మండలి ఇందుకు ఆమోదం తెలిపినట్లు పాక్ ఆర్థిక మంత్రి హమ్మద్ అజార్ వెల్లడించారు.
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై నిరసన వ్యక్తం చేస్తూ భారత్ నుంచి అనేక వస్తువుల దిగుమతిపై పాక్ 2019లో నిషేధం విధించింది. కరోనా సమయంలో మాత్రం ఔషధాలు, వాటి ముడి పదార్థాల దిగుమతులకు మినహాయింపునిచ్చింది. ఇప్పుడు మళ్లీ రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది.
భారత్, పాక్ సైన్యాధికారులు ఫిబ్రవరిలో చర్చలు జరిపి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా పాటించాలని నిర్ణయించారు. పాకిస్థాన్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. అందుకు స్పందనగా ఆయన కూడా మంగళవారమే లేఖ పంపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకొని, శాంతి స్థాపన దిశగా సాగాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయి.
ఇదీ చూడండి: కశ్మీర్ సమస్య పరిష్కారంతోనే శాంతి: ఇమ్రాన్