పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ మరో కుట్రకు తెర తీసింది. అఫ్గానిస్థాన్‌లో భారత్ ఆస్తులను, ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం 10,000 మంది సాయుధులను అఫ్గాన్‌కు పంపింది. "తాలిబన్లకు మద్దతుగా భారీ సంఖ్యలో పాక్ సాయుధులు అఫ్గాన్‌లోకి ప్రవేశించారు. భారత ఆస్తులను, భవనాలను లక్ష్యంగా చేసుకోవాలని వీరికి సూచనలు ఇచ్చారు" అని అఫ్గాన్‌లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత్ వర్గాలు తెలిపాయి. కొన్ని నెలలుగా అఫ్గాన్‌లోని కీలక ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లోని భారత్ ఆస్తులను ధ్వంసం చేయాలని పాక్ భావిస్తోంది. అందుకే సాయుధ మూకలను పంపింది. తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో వీరు భారత్ ప్రాజెక్టులపై దాడి చేస్తారు. 2001 నుంచి అఫ్గాన్ పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 800 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ దేశ పార్లమెంటును నిర్మించింది. ప్రతి ప్రావిన్స్‌లో పాఠశాలలు, రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.
రెండో రోజూ కొనసాగిన అఫ్గాన్-తాలిబన్ చర్చలు
అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులు, తాలిబన్ల మధ్య కతార్ రాజధాని దోహాలో శనివారం ప్రారంభమైన చర్చలు ఆదివారం కూడా కొనసాగాయి. అయితే తాలిబన్లు ఓ వైపు ప్రభుత్వ దళాలపై దాడులు చేస్తూ, కీలక ప్రాంతాలను ఆక్రమిస్తున్న నేపథ్యంలో చర్చల పురోగతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ నాయకుడు హైబతుల్లా అఖుంద్‌జాదా కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక పరంగా తాము ముందంజలో ఉన్నా.. తమకు రాజకీయ పరిష్కారమే కావాలని తెలిపారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్ వ్యవస్థను స్థాపించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: