రేపిస్టులను పట్టుకునేందుకు పాకిస్థాన్ సింధ్ రాష్ట్రానికి చెందిన ఏఎస్ఐ మహమ్మద్ బక్స్ బురిరో తన కన్న కూతుర్నే ఎరగా వేశారు. పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్ట్ చేశారు. అతనికి 'క్వైద్-ఈ-ఆజామ్' పోలీస్ మెడల్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది. ధైర్య సాహసాలను ప్రదర్శించిన అతని కూతురికి సైతం అత్యుత్తమ పౌర పురస్కారం ఇవ్వాలని లేఖలో కోరనుంది.
ఇదీ జరిగింది..
సింధ్ రాష్ట్రం కాష్మోర్ ప్రాంతానికి చెందిన రేపిస్టులు ఉద్యోగం ఇస్తామని చెప్పి కరాచీకి చెందిన ఓ తల్లినీ, ఆమె ఐదేళ్ల కూతుర్ని రప్పించారు. అక్కడకు వచ్చిన ఇద్దరిపై కొన్ని రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత వేరే ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు.
మరో యువతిని తీసుకొస్తే నీ కూతుర్ని వదిలేస్తామని నిందితులు ఆ తల్లికి చెప్పి పంపించారు. దీంతో ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పింది.
బురిరో సాహసం..
వెంటనే అప్రమత్తమైన ఏఎస్ఐ మహమ్మద్ బక్స్ బురిరో, తన కూతుర్ని ఫణంగా పెట్టి కిరాతకులను పట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. పక్కా ప్రణాళికతో ఓ పార్కులో వారిని అరెస్టు చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం తల్లీకూతుళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు.