పాకిస్థాన్ ప్రభుత్వ తీరుపై ఆ దేశంలోని అసమ్మతివాదులు గుర్రుగా ఉన్నారు. దేశంలో అభద్రతా భావం, అసమర్థత పెరిగిపోయాయన్నారు. పొరుగుదేశాలతో సఖ్యత లేకపోవడానికి కారణం 'పాకిస్థాన్ ఆర్మీ'నే అని ఆరోపించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను 'సైన్యం చేతిలో కీలుబొమ్మ'గా అభివర్ణించారు. ఉగ్రవాద వ్యతిరేక, మానవ హక్కుల దక్షిణాసియా దేశాల(ఎస్ఏఏటీహెచ్-సాథ్) ఐదో వార్షిక సదస్సులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
వర్చువల్‌గా జరిగన సాథ్ సమావేశంలో నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. దీనిపై నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు.
పాకిస్థాన్ అప్రకటిత 'మార్షల్ లా'లో ఉందని పశ్తూన్(పఠాన్) నేత, మాజీ సెనేటర్ అఫ్రాసియాబ్ ఖట్టక్ ఆరోపించారు.
"పాకిస్థాన్‌లో అత్యంత ప్రమాదకరమైన 'మార్షల్ లా' ఇది. రాజ్యాంగ సంస్థలను మార్షల్ లా తీవ్రంగా వక్రీకరించింది. రాజకీయ సంస్థలను సైనిక పాలన చట్టవిరుద్ధంగా మార్చుతోంది. పార్లమెంట్ సభ్యులు సభకు ఎప్పుడు హాజరు కావాలి, ఎప్పుడు ఓటింగ్‌కు వెళ్లొద్దు అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆదేశాలను ఇచ్చే స్థాయికి పరిస్థితి దిగజారింది."
-అఫ్రాసియాబ్ ఖట్టక్, పాకిస్థాన్ మాజీ సెనేటర్
ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా సాథ్ వ్యవస్థాపక సభ్యుడు హుస్సేన్ హక్కానీ విమర్శలు చేశారు. అంతర్జాతీయంగా పాకిస్థాన్ స్థానం బలహీనం కావడానికి కారణం 'సాత్' సంస్థే అని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
"మానవ హక్కుల కోసం పోరాడుతున్న వారి వల్ల పాకిస్థాన్ తన అంతర్జాతీయ ప్రతిష్ఠను కోల్పోలేదు. దేశంలో కొనసాగుతున్న విధానాలు, అతివాదం, స్వేచ్ఛను అణచివేయడం వల్లే పాక్ తన ప్రతిష్ఠను పోగొట్టుకుంది."
-హుస్సేన్ హక్కానీ, సాథ్ వ్యవస్థాపక సభ్యుడు
వీరితో పాటు వరల్డ్ సింధీ కాంగ్రెస్ నేత రుబీనా గ్రీన్వుడ్, గిల్గిత్-బాల్టిస్థాన్‌కు చెందిన తహీరా జబీన్, సెరైకీ ఉద్యమకారుడు షాహ్జాద్ ఇర్ఫాన్, పశ్తూన్ కౌన్సిల్ ఆఫ్ అమెరికాకు చెందిన రసూల్ మహ్మద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థాన్‌లోని మైనారిటీల హక్కులను ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు.
మనసు గెలుచుకునే దారదే
రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకోవడమే దేశంలో మతపరమైన అణచివేతకు ప్రధాన కారణమని ఇర్ఫాన్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఇస్లాం రాజ్యంగా కాకుండా.. మల్టీ నేషనల్ స్టేట్‌గా గుర్తించాలని గ్రీన్వుడ్ సూచించారు. తద్వారా సింధ్, బలోచ్ ప్రజల మనసులు గెలుచుకోవచ్చని అన్నారు. సింధ్‌కు చారిత్రక గుర్తింపు ఉందని, ఆ ప్రాంతాన్ని, గుర్తింపును విడదీయలేమని స్పష్టం చేశారు.
73 ఏళ్లుగా గిల్గిత్-బాల్టిస్థాన్ అనుభవిస్తున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, భౌగోళిక, రాజ్యాంగపరమైన ఒంటరితనానికి ముగింపు పలకాలని జబీన్ పిలుపునిచ్చారు. స్వయంప్రతిపత్తితో కూడిన వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో షియా వ్యతిరేక హింసను తీవ్రంగా ఖండించారు షియా హక్కుల పరిరక్షణ కార్యకర్త జాఫర్ మీర్జా. తహఫుజ్-ఈ-ఇస్లాం బిల్లు సహా ఇతర చట్టాల ద్వారా షియా వ్యతిరేక రాజకీయాలను చట్టబద్ధం చేయడంపై మండిపడ్డారు.
సైన్యం దూరంగా ఉండాలి
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తన పని తాను చేసుకునే విధంగా సైన్యం సహకరించాలని మాజీ రాయబారి, మాజీ సైనికాధికారి కమ్రాన్ షఫి పేర్కొన్నారు. రాజకీయాల నుంచి సైనిక అధికారులు దూరంగా ఉండాలని హితవు పలికారు. వలస రాజ్యంలో బ్రిటిష్-ఇండియన్ ఆర్మీ సైతం పౌర ఆధిపత్యానికి లోబడే ఉందని గుర్తు చేశారు.
ఏంటీ సాథ్?
సాథ్ అనేది పాకిస్థాన్‌లోని ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుల సమూహం. పాక్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ, అమెరికాకు చెందిన పత్రికా రచయిత డా. మహమ్మద్ తకీ కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇదివరకు లండన్, వాషింగ్టన్ నగరాల్లో ఈ సమావేశాలు జరిగాయి. కరోనా కారణంగా ఈ సారి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయ నేతలు, పాత్రికేయులు, సామాజిక మాధ్యమాల కార్యకర్తలు, ఉద్యమకారులు, ఇతర ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
సాథ్ సమావేశాలను అడ్డుకునేందుకు పాకిస్థాన్ సెక్యూరిటీ సర్వీస్ గతంలో ప్రయత్నించింది. ఇందులో పాల్గొన్న పాకిస్థానీయులు విదేశీ ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించింది. ప్రస్తుతం వర్చువల్ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో సభ్యులందరూ పాల్గొనేందుకు అవకాశం లభించింది.
ఇదీ చదవండి- ప్రజాచైతన్యంతో విద్వేషానికి చెల్లుచీటీ