ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ చిత్తశుద్ధ ఏపాటిదో మరోమారు బయటపడనుంది. పాక్ ఇప్పటివరకు చేపట్టిన చర్యల్ని సమీక్షించేందుకు పైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) బుధవారం నుంచి 3 రోజుల సమావేశం నిర్వహిస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికలోని 27 అంశాల్లో... 6 కీలక విధులను నిర్వర్తించడంలో పాక్ సర్కారు విఫలమైంది. ఫలితంగా ఆ దేశాన్ని 'గ్రే' జాబితాలోనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై శుక్రవారం తుది నిర్ణయం వెలువడనుంది.
2018 నుంచి..
అంతర్జాతీయ సమాజంలో ఒక దేశంగా పాకిస్థాన్ భవిష్యత్తు ఏంటో తేల్చేందుకు.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ జాబితా కీలకంగా ఉంటుంది. 2018 నుంచి పాక్ గ్రే జాబితాలోనే కొనసాగుతోంది. ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకోవాలని పాకిస్థాన్‌ను అదేశిస్తే.. తానే స్వయంగా హవాలా చేస్తూ.. వారికి సాయపడుతోంది. ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తూ తమ గడ్డపై నుంచే స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగించుకునే విధంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశాన్ని నిషిద్ధ జాబితాలోకి చేర్చాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ప్రస్తుతం పాక్ మరికొన్ని నెలలు గ్రే జాబితాలోనే కొనసాగనుంది.
కరోనా కారణంగా..
నిజానికి ఈ అంశంలో ప్రకటన గతేడాది చివర్లోనే వెలువడాల్సి ఉంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. జూన్‌లో జరగాల్సిన భేటీ మరోసారి తేదీ మార్చుకుని... అక్టోబర్ 21-23 మధ్య వర్చువల్ సమావేశంగా మారింది. అంతకుముందు ఫిబ్రవరిలో.. నాలుగు నెలల్లో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్దేశించిన 27 అంశాల్లో కేవలం 14 విషయాల్లోనే కొంతమేర అడుగులు ముందుకు పడ్డాయని, 13 అంశాల్లో ఎటువంటి చర్యలు చేపట్టలేదని పాక్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఎఫ్ఏటీఎఫ్. ఉగ్రవాద నిర్మూలనకు, వారికి అందుతున్న నిధులకు అడ్డకట్ట వేయటంలో పనితీరు ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది.
ద్వంద్వ వైఖరి
భారత్‌కు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోకపోవడం సహా ఉన్నట్టుండి 4 వేల మంది ఉగ్రవాదులు.. ముష్కరుల జాబితా నుంచి మాయమవడం, పాక్ గడ్డ నుంచి ఉగ్రవాదులకు ఆర్థికపరమైన సహాయం ఇంకా అందుతూ ఉండడం వంటి చర్యలను ఎఫ్ఏటీఎఫ్ తీవ్రంగా పరిగణిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం 21మంది ఉగ్రవాదులకు వీఐపీ భద్రతతో ఆశ్రయం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత్ ఇప్పటికే ఉగ్రవాదంపై పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై అనేక సార్లు బయటపెట్టింది.
చర్యలపై అసంతృప్తి
ఎఫ్ఏటీఎఫ్లో నామినేటింగ్ దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సైతం పాక్ చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పాక్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజం కళ్లుగప్పే చర్యలకు ఉపక్రమించింది. ఆర్మీ నివేదికల ప్రకారం పాకిస్థాన్.. అగస్టులో 88మంది ఉగ్రసంస్థలకు చెందిన నేతలు, సభ్యులపై కఠిన ఆంక్షలు విధించామని ఐరాస భద్రతామండలికి నివేదించింది. ఈ తరహా ప్రకటనలతో.. ఎఫ్ఏటీఎఫ్ నిషిద్ధ జాబితా నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడుతోంది.
ఆర్థిక వ్యవస్థకు కష్టమే
రోజురోజుకూ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను చక్కబరుచుకునేందుకు అప్పులబాట పడుతున్న పాకిస్థాన్.. ఉగ్రవాదం విషయంలో మాత్రం తీరు మార్చుకోవట్లేదు. ఈ నేపథ్యంలో గ్రే జాబితా నుంచి పాక్‌ను తొలగించడం అసాధ్యమే.
2018 జూన్‌లో నుంచి నిబంధనలు పాటించడంలో విఫలమవుతూ.. పాకిస్థాన్ అదే జాబితాలో కొనసాగుతోంది. గ్రే లిస్ట్ నుంచి పాక్ బయటపడాలంటే 12 ఓట్లు(మొత్తం 39 ఓట్లు) సాధించాల్సి ఉంటుంది. బ్లాక్ లిస్ట్‌ను తప్పించుకోవడానికి మూడు దేశాల మద్దతు అవసరం ఉంటుంది. చైనా, టర్కీ, మలేసియా దేశాలు పాకిస్థాన్ బ్లాక్ లిస్ట్‌లో చేరకుండా అడ్డుపడుతున్నాయి.
మొత్తంగా గ్రే జాబితాలో కొనసాగనున్న పాక్‌కు.. అనేక సమస్యలు తలెత్తనున్నాయి. ముఖ్యంగా అప్పులు పుట్టని పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, ఐరోపా సమాఖ్య నుంచి ఆర్థిక చేయూత అందటం కష్టమైపోతుంది. ఇప్పటికే కష్టాల ఊబిలో చిక్కుకున్న పాకిస్థాన్‌ను.. ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం మరిన్ని కష్టాలపాల్జేయనుంది. వచ్చే ఏడాది జూన్ వరకు అదే జాబితాలో కొనసాగనుంది దాయాది.
ఇదీ చూడండి: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
ఇదీ చూడండి: పాక్ క్రికెటర్లకు వీసా ఇస్తారో? లేదో?