ఐక్యరాజ్యసమితిలో జమ్ముకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ పదేపదే ప్రస్తావించడం పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాస భద్రతామండలిలో సంస్థ పని తీరుపై జరిగిన సదస్సులో భాగంగా పాక్ వైఖరిని తూర్పారబట్టింది.
ఐరాస రాయబారికి భారత ఉప శాశ్వత రాయబారి కె. నాగరాజు నాయుడు పాక్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ పట్ల విషం చిమ్ముతూ పాక్ తప్పుడు విషయాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. జమ్ముకశ్మీర్ అంశాన్ని ఐరాస వేదికగా మరోసారి లేవనెత్తి.. పాక్ ప్రపంచం కళ్లకు గంతలు కడుతోందని మండిపడ్డారు. కశ్మీర్ అంశాన్ని ఐరాస వేదికలపై పదేపదే లేవనెత్తుతున్నా.. మద్దతు పొందలేకపోతోందని గుర్తు చేశారు. తమ తప్పుడు ప్రచారాన్ని ఏ దేశమూ ఆలకించబోదని గుర్తించుకోవాలని సూచించారు.
దశాబ్దాల జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో ఐరాస తమ బాధ్యతలను విస్మరించినట్లు కనిపిస్తోందని పాక్ ప్రతినిధి సాద్ అహ్మద్ వారియక్ వాదించగా.. దీటుగా బదులిచ్చారు నాయుడు.
"చేప నీరు లేకుండా ఉండలేదు. అలానే ఓ ప్రతినిధి(పాక్) విద్వేషాన్ని వీడలేదు. ఆ ప్రతినిధి మాట్లాడే ప్రతిసారి విషం చిమ్ముతూ అసత్య ప్రచారం చేస్తోంది. సొంత దేశంలో మైనార్టీల సంక్షేమం పట్టించుకోకుండా ఇతర దేశాల్లో మైనార్టీలను రక్షించాలని వాదించడం ఆశ్చర్యం కల్గిస్తోంది. వారి సమస్యను కప్పిపుచ్చేందుకు ప్రపంచం దృష్టి మరల్చడానికే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోంది. భారత్ పట్ల తప్పుడు ప్రచారం మాని సాధారణ దౌత్య నీతిని అనుసరించాలి."
- నాగరాజు నాయుడు, ఐరాస రాయబారికి భారత ఉప శాశ్వత రాయబారి
అదే సమయంలో ఉగ్రవాదానికి ఉమ్మడి నిర్వచనాన్ని తేవడంలో విఫలమైందని ఐరాసపైనా నాగరాజు నాయుడు విమర్శలు గుప్పించారు.
గత వారం కశ్మీర్ అంశాన్ని ఐరాస భద్రతా మండలిలో లేవనెత్తేందుకు ప్రయత్నించి విఫలమైంది పాక్ సన్నిహిత దేశం చైనా. భారత్, పాక్ మధ్య ధ్వైపాక్షిక అంశాన్ని చర్చించేందుకు ఇది సరైన వేదిక కాదని కరాకండిగా తేల్చి చెప్పాయి సభ్య దేశాలు.
ఇదీ చూడండి: రామసేతు పిటిషన్పై 3 నెలల తర్వాత సుప్రీం నిర్ణయం