పాకిస్థాన్లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా రాష్ట్రంలో హిందూ ఆలయాన్ని కూల్చివేసిన వారిని అక్కడి హిందూ సంఘం క్షమించాలని నిర్ణయించింది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి పంఖ్తుంఖ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో నిర్వహించిన 'జిగ్రా'( స్నేహపూర్వక సమావేశం)లో ఘటనపై నిందితులు క్షమాపణలు కోరుకున్నారు. హిందువుల హక్కులకు రక్షణ కల్పిస్తామని ముస్లిం మతాధికారులు భరోసా ఇచ్చారు. నిందితులను నిర్బంధం నుంచి విడుదల చేయాలని కోరుతూ ఇరుపక్షాల ప్రతినిధులు సుప్రీంకోర్టుకు వినతి పత్రం అందించారు.
సమావేశం అనంతరం మాట్లాడిన స్థానిక హిందూ కౌన్సిల్ ఛైర్మన్ రమేశ్ కుమార్.. పురాతన దేవాలయాన్ని కూల్చివేసిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించి.. సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించినందుకు ఆ రాష్ట్ర సీఎం మహమ్మద్ ఖాన్కు ధన్యవాదాలు తెలిపారు.
దేవాలయ కూల్చివేత ఘటనను తీవ్రంగా ఖండించారు మహమ్మద్ ఖాన్. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించారు.
గత ఏడాది డిసెంబర్ 30న అతివాద ఇస్లాం పార్టీ జమైత్ ఉలేమా-ఎ-ఇస్లాం, కొందరు స్థానిక మతాధికారుల నాయకత్వంలో అల్లరిమూకలు.. పంఖ్తుంఖ్వా రాష్ట్రంలో హిందువుల పురాతన గుడిని, సమాధిని కూల్చివేశారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇదీ చదవండి: పాక్లో హిందూ ఆలయాన్ని కూల్చిన ఘటనలో 30 మంది అరెస్టు