Pakistan Bomb Blast: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
జిన్నాహ్ రోడ్డులోని సైన్స్ కాలేజీ వద్ద ఉన్న ఓ కారు సమీపాన ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేలుడుకు పాల్పడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పేలుడు జరిగిన సెరేనా హోటల్ ప్రాంతానికి సమీపంలోనే మరోసారి బాంబు పేలుడు జరగడం గమనార్హం.
ఇటీవల కాలంలో ఖైబర్ పాఖ్టున్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లలో బాంబు పేలుళ్లు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఈ దాడులు తరచూ జరుగుతుండటం గమనార్హం. ఈ ప్రాంతాల్లో పాకిస్థాన్ తాలిబన్, ఇస్లామిక్ స్టేస్ ఉగ్రవాద సంస్థల ప్రభావం తీవ్రంగా ఉంది.
ఇదీ చూడండి : ఒమిక్రాన్‌తో కరోనా కేసుల సునామీ: డబ్ల్యూహెచ్ఓ