అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా.. పాకిస్థాన్ ప్రభుత్వం లాహోర్ కేంద్రంగా పని చేస్తోన్న 11 ఉగ్రవాద అనుబంధ సంస్థలపై నిషేధం విధించింది. జైషే మహమ్మద్ , జమాత్ ఉద్ దవా (జేయూడీ) ఉగ్రసంస్థలతో వాటికి సంబంధాలున్నాయి.
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్షా మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ఉగ్రవాద అనుబంధ సంస్థలను నిషేధించాలని నిర్ణయించారు. పాకిస్థాన్ భూ భాగం కేంద్రంగా ఇతర దేశాలకు హాని కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలను ఎన్నటికీ సహించబోమని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ప్రభుత్వం మార్చి నెలలోనే జేయూడీతో సంబంధమున్న 7 ఉగ్రవాద అనుబంధ సంస్థలపై నిషేధం విధించిందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్సైట్లో పేర్కొంది. తాజాగా మరో 11 సంస్థలపై చర్యలు తీసుకుంది.
నిషేధం వీటిపైనే..
అల్-అన్ఫాల్ ట్రస్ట్, ఇదర ఖిద్మత్-ఇ-కలాఖ్, అల్-దావత్-ఉల్-ఇర్షాద్, మజీద్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్, అల్-మదీనా ఫౌండేషన్, మజ్-బిన్-జాబెల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, అల్-హమాద్ ట్రస్ట్‌లను నిషేధించింది పాక్ ప్రభుత్వం.
అలాగే ఎఫ్ఐఎఫ్తో సంబంధమున్న అల్-ఫజల్ ఫౌండేషన్/ట్రస్ట్, అల్-ఇసర్ ఫౌండేషన్లనూ నిషేధించినట్లు ఎన్ఏసీటీసీ ప్రకటించింది. ఇవన్నీ లాహోర్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాద అనుబంధ సంస్థలు.
బహవల్పూర్ కేంద్రంగా పని చేస్తోన్న అల్-రహమత్ ట్రస్ట్ ఆర్గనైజేషన్, కరాచీ కేంద్రంగా పనిచేస్తోన్న అల్-ఫుర్ఖన్ ట్రస్ట్లనూ నిషేధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
ఇటీవలి కాలంలో పాక్ ప్రభుత్వం సుమారు 30 వేల మతపరమైన సదస్సులను నియంత్రించింది.
పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తోన్న 'జైషే మహ్మద్' ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌ను మే 1న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడి 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఘటనకు మసూద్ సూత్రధారి.
సయీద్ హఫీజ్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా (జేయూడీ) ఉగ్రసంస్థను పాకిస్థాన్ ప్రభుత్వం ఫిబ్రవరిలోనే నిషేధించింది. అలాగే దాని స్వచ్ఛంద సంస్థ ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)పైనా మార్చిలో నిషేధం విధించింది. ఈ ఉగ్రవాద సంస్థలే 2008 ముంబయి దాడులకు పాల్పడింది.
ఇదీ చూడండి: 'హోటల్‌పై దాడి మా పనే'-బలూచ్ లిబరేషన్ ఆర్మీ