బుధవారం పాకిస్థాన్ ఓ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి 'ఘజ్నవి'ని ప్రయోగించినట్లు పాక్ సైన్యం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్ష చర్చనీయాంశమైంది.
కరాచీ గగనతలాన్ని బుధవారం మూసివేసిన పాకిస్థాన్.. ఈ పరీక్షను చేపట్టింది. ఈ క్షిపణికి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉందని పాక్ సైన్యం వివరించింది.
బుధవారం రాత్రి ఈ ప్రయోగం చేపట్టినట్లు పాకిస్థాన్ సైన్యం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అధ్యక్షుడు అరీఫ్ అల్వీ ప్రయోగం నిర్వహించిన బృందాన్ని అభినందించారు.
ఇదీ చూడండి: భారత్కు పాక్ గగనతలాన్ని మూసేయలేదు: ఖురేషీ