ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ విషం కక్కుతోంది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలన్న భారత్ నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఇలాంటి చర్యల వల్ల అణు సామర్థ్యం ఉన్న భారత్- పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడతాయన్నారు.
ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్టు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రాష్ట్రాన్ని.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని బిల్లు ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చల అనంతరం సంబంధిత బిల్లు, తీర్మానానికి ఆమోదం లభించింది.
అంతకుముందే భారత్ నిర్ణయాన్ని పాక్ విదేశాంగశాఖ కార్యాలయం ఖండించింది. త్వరలో పాక్‌లో పర్యటించే అమెరికా బృందం, అంతర్జాతీయ సంఘం వద్ద ఈ సమస్యను ప్రస్తావిస్తామని తెలిపింది.
భారత హైకమిషనర్‌కు సమన్లు...
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్ హైకమిషనర్ అజయ్ బిసారియాకు పాక్ సమన్లు జారీ చేసింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. భారత్ నిర్ణయం.. అంతర్జాతీయ చట్టాలు, ఐరాస తీర్మానాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించింది పాక్.