కశ్మీర్ అంశంలో అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈనెల ఆఖర్లో సౌదీ పర్యటనకు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లనున్నట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రెండు సార్లు సౌదీలో పర్యటింటిన ఇమ్రాన్.. కశ్మీర్‌పై మరోమారు సౌదీ ముఖ్యనేతలతో మంతనాలు చేయనున్నారు. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాక్ ప్రధాని సౌదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
సెప్టెంబర్ 27 ఐరాస వార్షిక సదస్సులో ప్రసంగించనున్న నేపథ్యంలో అమెరికా పర్యటనకు ముందే ఇమ్రాన్.. సౌదీకి వెళ్లనున్నట్లు ఓ టీవీ ఛానెల్ తెలిపింది. ఈ పర్యటనలో సౌదీలోని ముఖ్యనేతలతో ఇమ్రాన్ సమావేశమై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈనెల ప్రారంభంలో సౌదీ రాజధాని రియాద్‌లో ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబెయిర్, సౌదీలో పాకిస్థాన్ రాయబారి అరబియా రాజా అలీ ఇజాజ్ సమావేశమయ్యారు. ఇమ్రాన్ పర్యటనపై చర్చించారు.
మాకు మద్దతు...
సౌదీ విదేశాంగ మంత్రితో పాటు యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సెప్టెంబర్ 4న పాకిస్థాన్‌లో పర్యటించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో పాటు ఇతర నేతలతో కశ్మీర్ అంశంపై చర్చించారు. అనంతరం కశ్మీర్ అంశం ముస్లింలకు సంబంధించిన సమస్య కాదని వారు పేర్కొన్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను పాక్ విదేశాంగ శాఖ ఖండించింది. యూఏఈ, సౌదీలు కశ్మీర్ విషయంలో తమకు మద్దతు పలికారని పేర్కొంది.
ఇదీ చూడండి: పీఓకేలో... కశ్మీర్‌పై ఇమ్రాన్‌ఖాన్ 'విధాన ప్రకటన'