Imran Khan Faces Revolt: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆయన ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఇమ్రాన్‌కు పదవీ గండం తప్పేలా లేదు. పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభాలకు ఇమ్రాన్ ప్రభుత్వ విధానాలే కారణమంటూ ప్రతిపక్షాలు కొంతకాలంగా మండిపడుతున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విపరీతంగా పెరిగిన రుణాలు వంటి సంక్షోభాల నేపథ్యంలో ఇమ్రాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. వీటికి బాధ్యత వహిస్తూ ఇమ్రాన్ ఖాన్‌ను పదవినుంచి తొలగించాలని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన దాదాపు 100 మంది చట్టసభ సభ్యులు మార్చి 8న నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ ముందు అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించారు.
ప్రధానికి వ్యతిరేకంగా ఓటు..
విపక్షాల తీర్మానంపై ఇమ్రాన్ ఖాన్ ఇప్పటి వరకు బెదిరింపు ధోరణిలోనే స్పందిస్తున్నారు. కానీ.. తాజాగా ఈ తీర్మానంపై ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అధికార పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్- పీటీఐ పార్టీకి చెందిన దాదాపు 24 మంది సభ్యులు బహిరంగంగా ప్రకటించారు. ప్రజల సమస్యల విషయంలో తాము చేసిన ఫిర్యాదులను పరిష్కరించడంలో ఇమ్రాన్ విఫలమయ్యారని.. పీటీఐకి చెందిన అసంతృప్తి సభ్యులు ఆరోపించారు. అందుకే ప్రధానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ 24 మంది సభ్యులు ఇస్లామాబాద్‌లోని సింధ్ హౌస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భవనం సింధ్ ప్రావిన్సులో అధికారం చేపట్టిన ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందినది. ప్రస్తుతం అధికార పార్టీ సభ్యులు ప్రభుత్వం తమను అపహరించుకుపోతుందనే భయంతో ఉన్నారని పీపీపీ అధికార ప్రతినిధి ఘనీ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ వారిని బెదిరించి.. ఆయనకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అధికారం కాపాడుకోవాలని ఇమ్రాన్ తిప్పలు..
ఈ పరిస్థితుల్లో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పనిలో పడ్డారు. తన పార్టీ కీలక నేతలు, మంత్రులతో సమావేశమయ్యారు. అసమ్మతి నేతలను అనర్హులుగా ప్రకటించాలనే దానిపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు. అయితే పార్టీ నేత ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాత మాత్రమే ఎవరిపైనైనా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఖాన్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న పది లక్షల మంది కార్మికులతో ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేతలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి షేక్ రషీద్ ఆరోపించారు. అధికార పార్టీ సభ్యులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. సింధ్ ప్రావిన్సులో పీపీపీ ప్రభుత్వాన్ని రద్దుచేసి గవర్నర్ పాలన విధించాలని ప్రధానిని కోరారు.
పాకిస్థాన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే సైన్యం సైతం ఇమ్రాన్ ఖాన్‌పై కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ ప్రభుత్వ సంక్షోభం విషయంలో మిలిటరీ తటస్థంగా ఉంటుందని ఇటీవల పాక్ ఆర్మీ ప్రతినిధి ఒకరు అన్నారు. దీనిపై స్పందించిన ఇమ్రాన్ మనుషులు ఏదో ఒకపక్షం వహిస్తారని జంతువులు మాత్రమే తటస్థంగా ఉంటాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఖాన్ వ్యాఖ్యలపై.. ఆర్మీ బహిరంగంగా స్పందించనప్పటికీ సైన్యం పట్ల ఖాన్ వ్యవహరించిన తీరుతో పెద్దతప్పిదం చేశారని భావిస్తున్నారు.
28న ఓటింగ్..
అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఈ నెల 21న నుంచి పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న తీర్మానంపై.. ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కావాల్సిన సభ్యుల మద్దతు తమకు ఉందని ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. ప్రస్తుతం 342 మంది సభ్యులున్న పాక్ పార్లమెంట్‌లో.. 172 మంది ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి 155 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అతికష్టం మీద ఆరుపార్టీలకు చెందిన 23 మంది సభ్యుల మద్దతుతో 2018లో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన 24 మంది సభ్యులు బహిరంగంగానే ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. అధికార కూటమిలోని పలు పార్టీలు కూడా ఆయనపై అసంతృప్తితో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని కోల్పోవడం లాంఛనంగానే కనిపిస్తోంది.
ఇవీ చూడండి: భారత్‌పై పాక్ 'రివెంజ్ షో' అట్టర్ ఫ్లాప్- గాల్లోనే పేలిపోయిన మిసైల్!