India missile hit Pakistan: భారత క్షిపణి పొరపాటున పాకిస్థాన్లో పడడంపై ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ స్పందించారు. ఈ ఘటనపై భారత్ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. క్షిపణి ప్రయోగం లాంటి అత్యంత సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్వహించగల శక్తి సామార్థ్యాలు భారత్కు లేవా అని ప్రశ్నించారు.
రెండు రోజుల క్రితం భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడినట్లు రక్షణశాఖ వెల్లడించింది. మార్చి 9న జరిగిన క్షిపణి ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తి ఈ పొరపాటు జరిగినట్లు తెలిపింది. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదన్న రక్షణశాఖ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది.
అయితే ఈ ఘటన గురించి పాక్ కు తెలియజేయడంపై భారత్ అలసత్వం వహించిందని మొయీద్ యూసఫ్ అన్నారు. ఇటువంటి సున్నితమైన సాంకేతికతను పరీక్షించే అంశంలో భారతదేశ సామర్థ్యంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ క్షిపణి అంతర్జాతీయ, దేశీయ విమానయాన మార్గానికి చేరువగా ప్రయాణించి పౌరుల భద్రతకు ముప్పు తెచ్చిందని అన్నారు. క్రూయిజ్ క్షిపణిని అనుకోకుండా ప్రయోగించిందన్న దానిపై భారత అధికారులు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: పాక్ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత క్షిపణి.. అసలేమైంది?