అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ నూతన నివేదిక వెలువడేందుకు ముందు పాకిస్థాన్‌కు షాకిచ్చింది అగ్రరాజ్యం అమెరికా. లష్కరే తొయిబా అగ్రనేత హఫీజ్ సయీద్ సహా ఆ ఉగ్రసంస్థ సభ్యులపై విచారణ జరపాలని దాయాదికి సూచించింది. అమెరికా దక్షిణ, మధ్య ఆసియా విభాగం అధ్యక్షుడు అలీస్ వెల్స్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. లష్కరే తొయిబా, జమాత్ ఉద్ దవాకు చెందిన నలుగురు అగ్రనేతల అరెస్టును స్వాగతించారు.
"పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన విధంగా ఆ దేశ భవిష్యత్ కోసం వారి భూభాగంపై ఉగ్రవాదాన్ని నియంత్రించాల్సిందే. నలుగురు ఉగ్రవాదుల అరెస్టును స్వాగతిస్తున్నాం. లష్కరే చేసిన దాడుల బాధితులకు న్యాయం కోసం హఫీజ్ సయీద్ సహా అతడి అనుచరుల్ని విచారించాలి."
-అలీస్ వెల్స్ ట్వీట్
లష్కరే, జేయూడీకి చెందిన నలుగురు ఉగ్రవాదులు జాఫర్ ఇక్బాల్, యాహ్యా అజీజ్, మహ్మద్ అష్రఫ్, అబ్దుల్ సలామ్‌లను పాక్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. కానీ ఉగ్రవాదులను అరెస్టు చేయడం, తిరిగి విడుదల చేయడం పాక్‌లో సాధారణమైపోయింది.
గతేడాది జూన్‌లో పాక్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చింది అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ. 2019 అక్టోబర్ నాటికి తమ సూచనలు పాటించాలని నిర్దేశించింది. ఈ నెల 12 నుంచి 15 వరకు పాక్ సహా పలు దేశాల పురోగతిపై సమీక్ష చేస్తుంది ఎఫ్ఏటీఎఫ్. పాక్‌ను గ్రే లిస్టులోనే కొనసాగిస్తుందా లేక బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తుందా అనే అంశం తెలిసేందుకు మరికొంత సమయం పట్టనుంది.
ఇదీ చూడండి: ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గిందా? త్వరలో ప్రకటన!