అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వినియోగంలో లేని విలువైన ప్రభుత్వ ఆస్తులను విక్రయించడానికి నిర్ణయించుకుంది. దేశీయ, విదేశీ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు దుబాయ్ ఎక్స్పో ప్రదర్శనను వేదికగా ఎంచుకుంది.
ప్రజా సంక్షేమం కోసం..
ఆస్తులను విక్రయించగా వచ్చిన ధనాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు వినియోగిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. విద్యా, వైద్య, ఆహార, గృహనిర్మాణం లాంటి ప్రజాసంక్షేమ పథకాలకు వినియోగిస్తామని ఆయన వెల్లడించారు.
"దేశ,విదేశీ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు దుబాయ్ ఎక్స్పో ప్రదర్శనను వేదికగా ప్రస్తుతం వినియోగంలో లేని ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలని నిర్ణయించాం. దురదృష్టమేంటంటే గత ప్రభుత్వాలు ఈ విలువగల ఆస్తులను వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేశాయి. కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నప్పటికీ, వివిధ ప్రభుత్వ సంస్థలు ఏటా కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తున్నాయి."
- ఇమ్రాన్‌ఖాన్, పాక్ ప్రధాని
పాక్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని మిత్ర దేశాలైన చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక సహాయం చేశాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పాక్‌కు ఆరు బిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది.
ఇదీ చూడండి : వజ్రాలతో పొదిగిన క్రిస్మస్ ట్రీ... ధర తెలిస్తే షాక్