రాజద్రోహం కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పెషావర్ హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ విషయంలో ముషారఫ్‌కు అండగా నిలిచింది ఆ దేశ ప్రభుత్వం. శిక్షను సవాల్ చేస్తూ ఆయన తరపున పిటిషన్ దాఖలు చేయాలని ఇమ్రాన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ముషారఫ్‌కు మరణశిక్ష విధించడం పట్ల పాకిస్థాన్ సైన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
స్విట్జర్లాండ్‌లోని జెనీవా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. సైన్యం అసంతృప్తిని చల్లబరిచేందుకు తనకు నమ్మకస్తులైన ఇద్దరు వ్యక్తులను వారి వద్దకు దూతలుగా పంపించారు. ముషారఫ్‌కు అండగా ఉంటామన్న సమాచారాన్ని పాక్ సైన్యానికి చేరవేశారు.
ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెంటనే స్పందించిన పాకిస్థాన్ సైన్యం ముషారఫ్ ఎన్నటికీ రాజద్రోహి కాదని తెలిపింది. న్యాయస్థానం తీర్పు చాలా బాధ కలిగించిందంటూ వ్యాఖ్యానించింది.